ఆగ్రాతో శివాజీకి సంబంధమేంటీ?మొఘల్ మ్యూజియం పేరు మార్చటమేంటీ? మండిపడ్డ మొఘల్ వారసుడు

  • Published By: nagamani ,Published On : September 25, 2020 / 11:08 AM IST
ఆగ్రాతో శివాజీకి సంబంధమేంటీ?మొఘల్ మ్యూజియం పేరు మార్చటమేంటీ? మండిపడ్డ మొఘల్ వారసుడు

‘‘మొఘలులు మన హీరోలు కాదు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మన హీరో ..అటువంటిది మొఘలులకు సంబంధించిన ఆనవాళ్లు ఎందుకుండాలి’’? అంటూ గత కొన్ని రోజుల క్రితం సీఎం యోగీ ఆదిత్యానాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాదు ఆగ్రాలో సీఎం యోగీ ప్రభుత్వం ‘మొగల్ మ్యూజియం’ పేరును మార్చడంపై కూడా వివాదం చెలరేగుతోంది. మొఘల్ మ్యూజియం అనే పేరు మార్చి మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ పేరును పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. దీనిపై మొగల్ వంశ ‘చివరి వారసుడి’నని చెప్పుకునే హైదరాబాద్ వాసి యాకూబ్ హబీబుద్దీన్ ప్రిన్స్ టూసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


శివాజీకి ఆగ్రాతో సంబంధమేంటీ? ఆయనకు ఆగ్రాతో ఎటువంటి సంబంధం లేదు..అటువంటిది మొఘల్ మ్యూజియం పేరును మార్చి శివాజీ పేరు పెడతానటం ఏంటీ అంటూ తీవ్ర ఆగ్రహంగా ప్రశ్నించారు. అంతేకాదు ఆగ్రాలో ఉన్న తన సొంత భూమిలో ‘మొఘల్ మ్యూజియం’’నిర్మాస్తానని ప్రతిజ్ఞ చేశారు టూసీ. యోగీ ప్రభుత్వం తీసుకునే ఇటువంటి నిర్ణయాలతో ప్రజల సామరస్యం దెబ్బతింటుందని అశాంతిని రేకెత్తిస్తాయని అన్నారు. ప్రజల్లో స్నేహభావాలు దెబ్బతిసే ఇటువంటి నిర్ణయాలు సరికావని టూసీ సూచించారు.


‘ఆగ్రాకు వెళ్లేవారు మొగల్ రాజుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. శివాజీకి ఆగ్రాతో ఏం సబంధం? మొగల్ మ్యూజియానికి ఆయన పేరు పెట్టడంతో అర్థం లేదు..మొగల్ చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ దేశం కోసం త్యాగం చేశారని టూసీ పేర్కొన్నారు. జాఫర్‌ను బ్రిటిష్ పాలన బహిష్కరించిందనీ..ఆయన్ని మయన్మార్‌లోని జైలులో వేశారని ఈ సందర్భంగా టూసీ గుర్తు చేశారు. ఆగ్రాలో తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో మొగల్ మ్యూజియం నిర్మిస్తానని స్పష్టం చేశారు.


భారతీయులంతా ఒక్కటేనని కానీ యోగీ ప్రభుత్వం ప్రజల్లో అశాంతి రేకెత్తించటానికి ఇటువంటి అంశాలను లేవదీస్తుంటుందనీ..మతాలు..కులాల మధ్య చిచ్చు పెట్టటం సరికాదన్నారు. నాకు అటువంటి బేధాలు లేవని అందుకే అయోధ్య రామమందిరానికి తన వంతుగా బంగారు ఇటుకను అందజేస్తానని తెలపటం అందుకు ఉదాహరణ అని అన్నారు. కాగా..టూసీ మొగల్ వారసుడినని చెప్పుకుంటున్నా చాలా మంది నమ్మకపోవటం గమనించాల్సిన విషయం.