ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు : రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం కావాలి

  • Published By: madhu ,Published On : October 9, 2019 / 02:12 AM IST
ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు : రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం కావాలి

ముంబైలో.. దసరా ఉత్సవాల్లో భాగంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. శివసేనకు రాజకీయాల కంటే.. రామాలయ సమస్యే టాప్‌లో ఉందని చెప్పారు. మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు.. ఈ ఇష్యూకు సంబంధం లేదన్నారు. సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్కులో అక్టోబర్ 08వ తేదీ మంగళవారం జరిగిన దసరా ఉత్సవాల్లో.. ఉద్ధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రామమందిరం కట్టే వరకు తాము విశ్రమించేది లేదన్నారు ఉద్ధవ్ థాక్రే. ప్రాణం పోయినా.. మాట తప్పకపోవడమే శివసేన సిద్ధాంతమని చెప్పారు. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున.. ప్రధాని మోడీ రామమందిరం గురించి ఎవరూ మాట్లాడకూడదని సూచించినట్లు తెలిపారు ఉద్ధవ్. కానీ.. అయోధ్య కేసు 35 ఏళ్లుగా.. పెండింగ్‌లోనే ఉందన్నారు. రాముడు.. రావణుడిని చంపిన రోజున కోర్టులు మూసి ఉన్నాయని.. రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజు కూడా కోర్టులు మూసే ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు.. రాముడు అయోధ్యలో జన్మించాడా.. లేడా.. అన్నదే సమస్యగా మారిందన్నారు ఉద్ధవ్ థాక్రే.

ఈ నెలలో.. అయోధ్య కేసుపై సుప్రీం తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. లేకపోతే.. రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న తమ డిమాండ్‌కు.. శివసేన కట్టుబడి ఉంటుందన్నారు. రాజకీయాల కోసం తాము ఈ డిమాండ్ చేయడం లేదని.. ఆలయ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు ఉద్ధవ్ థాక్రే. ఇక.. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు కూడా.. శివసేన ఎన్నో ఏళ్లుగా చేస్తున్న డిమాండ్ అని చెప్పారు ఉద్ధవ్. తమ తర్వాతి ఎజెండా యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావడమేనన్నారు థాక్రే.
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 21న మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో.. శివసేన పొత్తు నిర్ణయాన్ని థాక్రే సమర్థించుకున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసమే.. కాషాయ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలిపారు. పొత్తులో భాగంగా.. శివసేన సీట్లు బీజేపీ వెళ్లాయన్నారు. ఇందుకు.. పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్ధవ్ క్షమాపణ కోరారు. 
Read More : శత్రుదేశం గుండెల్లో రైళ్లు : రాఫెల్ యుద్ధ విమానం ప్రత్యేకతలు