భార్యల నుంచి కాపాడాలంటూ సీఎంకు లాయర్ లేఖ

  • Published By: madhu ,Published On : April 22, 2020 / 04:01 AM IST
భార్యల నుంచి కాపాడాలంటూ సీఎంకు లాయర్ లేఖ

లాక్‌డౌన్ కారణంగా దేశంలో దాదాపు అందరూ రోడ్ల మీదకు రాకుండా ఇళ్లలోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే ఇళ్లకే పరిమితం కావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయట.. ఇప్పటికే ఈ విషయం అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రికి వచ్చిన ఓ లేఖ విస్తుపోయేలా ఉంది. 

అదేమిటంటే భార్యల గృహహింసను భరించలేకున్నామని, అందుకోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని.. లాక్‌డౌన్‌ వేళ తమిళనాడులోని భర్తల గోడు ఇది. ఇళ్లకే పరిమితమైన భర్తలను భార్యల గృహహింస నుంచి తప్పించాలంటూ తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్‌ తమిళన్‌ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి వినతిపత్రం పంపారు.

వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండడంతో పురుషుల పరిస్థితి దయనీయంగా మారిందని న్యాయవాది అరుళ్ తమిళన్ లేఖలో వెల్లడించారు. భార్యలు భౌతికంగా, మానసికంగా పురుషులను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయారు. ఎంతో మంది మహిళలు సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపించి భర్తలను భయ పెడుతున్నారని, ఇదే సమయంలో మహిళలను ఇబ్బంది పెడితే, అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారని, మగవారి బాధలు తెలుపుకునేందుకు కనీసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అరుళ్‌ తమిళన్‌ ముఖ్యమంత్రిని కోరారు.