మాజీ సీఎంగారూ..మీరు పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది : మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 06:56 AM IST
మాజీ సీఎంగారూ..మీరు పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది : మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటక మాజీ  హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నారనీ..ఇటువంటి వ్యక్తులు భారత్ లో ఉండటానికి తగరనీ కాబట్టి కుమారస్వామి ఇక  పాకిస్థాన్ దేశానికి వెళ్లిపోవడం మంచిదని వ్యాఖ్యానించారు.

కాగా..బీజేపీకి పాకిస్థాన్ పై మక్కువ ఎక్కువ..ప్రపంచ పటంలో పాకిస్థాన్ ఉనికిలో లేనట్లయితే బీజేపీకి భారతదేశంలో ఓట్లు వచ్చే అవకాశం కూడా లేదని కుమారస్వామి ఇటీవల ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీరాములు ఈ వ్యాఖ్యలు చేశారు.  

మాజీ సీఎం కుమారస్వామి భారతదేశంలో నివశిస్తూ పొరుగుదేశమైన పాకిస్థాన్ పై ప్రేమ చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఇటువంటి  “డబుల్ స్టాండర్డ్ పాలిటిక్స్”(ద్వంద రాజకీయాలకు) పాల్పడేవారు అక్కడకు వెళ్లటమే మంచిదన్నారు.  మాజీ ప్రధానమంత్రి కుమారుడిగా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి భారత పౌరుల మనోభావాలను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తూ, చాలా ఏళ్లుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.ఇలా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలంటే కుమారస్వామి దేశం వదిలి వెళ్లాలని మంత్రి కోరారు.

భారతదేశం “హిందూ రాజ్యం’’. ఈ దేశంలో అన్ని వర్గాలు..కులాల ప్రజలు కలిసి జీవిస్తున్నారు. కాని కాంగ్రెస్, జెడి(ఎస్) వంటి పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రంలో చీలికలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. 

దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిని కాల్చేయాలి : మంత్రి అశోక 
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో ముందుండే బీజేపీ నేతలు మరోసారి తమ నోటికి పనికల్పించారు. వీరిలో మంత్రి శ్రీరాములుతో పాటు రెవెన్యూ మంత్రి ఆర్ అశోక కూడా ఉన్నారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కాల్చివేయాలంటూ వ్యాఖ్యానించారు. జనవరి 23న  సుబాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దండలు వేసిన అనంతరం మంత్రి అశోక మాట్లాడుతూ.. “ఎవరైనా పాకిస్తాన్ స్వరం పాడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే..వారు హిందూ అయినా, క్రిస్టియన్ అయినా లేదా ముస్లిం అయినా  కాల్చివేయాలి అంటూ వ్యాఖ్యానించారు.