కొత్త కశ్మీర్ తయారు చేస్తాం: మోడీ

కొత్త కశ్మీర్ తయారు చేస్తాం: మోడీ

మునుపెన్నడూ లేని విధంగా కొత్త కశ్మీర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ మాటిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన గురువారం నాసిక్‌లో ఓ బహరింగ సభలో ప్రసగించారు. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని అన్నారు. ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్ ప్రజలను దూరం చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహుకరించిన తలపాగాతో మోదీ బహరింగ సభలో పాల్గొన్నారు. 

‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉంటాం’ అని మోడీ వ్యాఖ్యానించారు. జాతీయ భద్రతపై యూపీఏ ప్రభుత్వం కనీసమైనా శ్రద్ధ చూపించలేదని విమర్శించారు మోడీ. సైనిక బలగాల కోసం 2009లో 1.86లక్షల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. 

‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే డిమాండ్ నెరవేరింది. అప్పటివరకూ సరిహద్దుల్లో జవాన్లు అవి లేకుండానే ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్‌లో తయారయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దాదాపు 100దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు’ అని మోడీ తెలిపారు.

శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. ‘పవార్‌కు ఏమైంది? సీనియర్ నేత పాకిస్తాన్ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే బాధగా అనిపిస్తోంది. పొరుగుదేశమంటే ఇష్టం ఉండొచ్చుగానీ, ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోడీ వ్యాఖ్యానించారు.