LG “వైశ్రాయ్” లా మారతారు..GNCTD చట్టానికి సవరణలు అప్రజాస్వామికమన్న చిదంబరం

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే

LG “వైశ్రాయ్” లా మారతారు..GNCTD చట్టానికి సవరణలు అప్రజాస్వామికమన్న చిదంబరం

Lg Will Become Viceroy Says Chidambaram Slamming Proposed Amendments To Gnctd Act

GNCTD Act ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కట్టబెట్టేలా GNCTD(Government of National Capital Territory of Delhi)సవరణ బిల్లు 2021ని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్రభుత్వం లేదా క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానిని అమలుచేయడానికి ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్రం- ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య వివాదం రేగుతోంది.

అయితే,తాజాగా ఈ అంశంపై మాజీ కేంద్రఆర్థికమంత్రి చిదంబరం స్పందించారు. కేంద్రం నిర్ణయాన్ని చిదంబరం తప్పుబట్టారు. జీఎన్ సీటీడీ చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించడాన్ని…అప్రజాస్వామికం మరియు ప్రజాస్వామ్య విరుద్దమైనదిగా చిదంబరం అభివర్ణించారు. అంతేకాకుండా ఇది ఢిల్లీ ప్రజలకు అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు. శాసనసభ అధికారాలను ఢిల్లీకి విస్తరించాలని డిమాండ్ ఉంది.. దీనికి విరుద్ధంగా, ప్రతిపాదిత సవరణలు ఢిల్లీ ప్రభుత్వాన్ని మునిసిపాలిటీ కంటే తక్కువగా చేస్తాయని చిదంబరం వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

కేంద్రం ప్రతిపాదించిన సవరణల ప్రకారం..కేంద్రప్రభుత్వం చేత నియమించబడే లెఫ్టినెంట్ గవర్నర్.. తన యజమాని కోరిక ప్రకారం అన్ని అధికారాలను ఉపయోగించే “వైశ్రాయ్”గా మారుతారని చిదంబరం ఆరోపించారు. కేంద్ర సవరణలను ప్రజలు వ్యతిరేకించాలని మరియు విపక్షాలు పార్లమెంట్ లో ఈ సవరణలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చిదంబరం తెలిపారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాష్ట్రంగా ఉన్న ఢిల్లీ.. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. తర్వాత సర్కారియా కమిషన్ సిఫారసు మేరకు 1991లో ఎన్‌సీటీగా ఢిల్లీని గుర్తించి.. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. అయితే, కేంద్రం ప్రతిపాదించిన తాజా సవరణలు.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆప్ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించడంతో ఈ బిల్లు ద్వారా తమ ప్రభుత్వానికి అధికారాలను పూర్తిగా తొలగించడానికి బీజేపీ సిద్ధమయ్యిందని ట్విట్టర్ వేదికగా సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు.