ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పథకం “బీమా జ్యోతి”

ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పథకం “బీమా జ్యోతి”

LIC ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ).. బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత, పొదుపు పథకం. ఈ పథకం భవిష్యత్‌కు భద్రతతో పాటు పొదుపునకు కూడా అవకాశం కలిపిస్తునట్లు ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల కాలపరిమితితో పాలసీని తీసుకోవచ్చు. 90 రోజుల వయసు నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారు ఈ పాలసీ కొనుగోలుకు అర్హులు. పథకం గడువు ముగిశాక హామీ ఇస్తున్న మొత్తాన్ని పాలసీదారుడికి ఎల్‌ఐసీ చెల్లించనుంది. ఒకవేళ పాలసీదారు అకాల మరణం చెందితే (పాలసీ కాలపరిమితి లోగా), ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక మద్దతు కల్పిస్తుంది.

హామీలో భాగంగా తీసుకున్న పాలసీ(బేసిక్‌) విలువపై ప్రతీ ఏడాది చివర్లో రూ. 1,000కి రూ. 50 చొప్పున జమ (గ్యారంటీడ్‌ ఎడిషన్స్‌) చేయనుంది. రిస్క్‌ ప్రారంభమయ్యాక పాలసీ కాలంలో దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే.. నిబంధనల ప్రకారం బీమా విలువతోపాటు, అప్పటివరకూ జమ అయిన అదనపు మొత్తాన్ని చెల్లించనుంది.