Uttarakhand: పరీక్షల్లో మోసానికి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
ఇటీవల ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి. దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం స్పందించింది.

Uttarakhand: పరీక్షల్లో మోసానికి పాల్పడితే ఇకపై జీవిత ఖైదు లేదా పదేళ్ల కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఈ మేరకు కొత్త చట్టాన్ని రూపొందించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన పేపర్లు వరుసగా లీకయ్యాయి.
దీనిపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం స్పందించింది. పేపర్ లీకేజీ, పరీక్షల్లో మోసాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. దీనిపై ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఇకపై ఎవరైనా పరీక్షల్లో ఎలాంటి మోసాలకు పాల్పడ్డా నేర తీవ్రతను బట్టి యావజ్జీవ శిక్ష లేదా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. నిందితుల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుంటారు. ప్రభుత్వం ఉత్తరాఖండ్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ఆర్డినెన్స్ (మెజర్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ రెడ్రెస్సల్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ ఇన్ రిక్రూట్‌మెంట్) పేరుతో దీన్ని రూపొందించింది.
అందరూ దీన్ని యాంటీ కాపియింగ్ ఆర్డినెన్స్ అని కూడా పిలుస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ శుక్రవారం ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్ చట్టంగా మారింది. ఈ ఆర్డినెన్స్ రూపొందించిన సందర్భంగా సీఎం ధామి మాట్లాడుతూ తమ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను నెరవేర్చడంలో రాజీ పడబోదన్నారు.