BJP Asks Musk To Block Manish Sisodia Twitter : మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయమని ఎల్కన్ మస్క్‌ను కోరిన బీజేపీ
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ఎలన్ మస్క్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఒక క్రిమినల్ అంటూ పేర్కొంది.

BJP Asks Elon Musk To Block Tihar Jailed Manish Sisodia’s Twitter Handle
BJP Asks Elon Musk To Block Manish Sisodia’s Twitter : లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ, ఆప్ నేత మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈక్రమంలో మనీశ్ సిసోడియా ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కు బీజేపీ విజ్ఞప్తి చేసింది. లిక్కర్ స్కామ్ లో సిసోడియా ఒక క్రిమినల్ అంటూ పేర్కొంది. మనీష్ సిసోడియా ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఢిల్లీ బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ ఎలాన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సిసోడియా ట్విట్టర్ ఖాతాను మరొకరు హ్యాండిల్ చేస్తున్నారని కాబట్టి అతని ఖాతాను బ్లాక్ చేయాలని బగ్గా ఎలన్ మస్క్ కు విజ్ఞప్తి చేశారు.
సరైన ఆధారాలు లేకుండా తనను అరెస్టు చేసి మద్యం పాలసీ కేసులో ఇరికించారని అధికార బీజేపీని విమర్శిస్తూ ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ట్విట్టర్ హ్యాండిల్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ బగ్గా ఈ విధంగా పేర్కొన్నారు. దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని వారు (బీజేపీ) జైలుకు పంపుతున్నారని అందులో సిసోడియా పేర్కొన్నారు. అయితే జైలులో ఉన్న సమయంలో ఆ అకౌంట్ నుంచి ట్వీట్ రావడం ఆసక్తికరంగా మారింది. ‘‘దేశంలో స్కూళ్లు తెరిచినప్పుడు జైళ్లు మూతపడతాయని ఈ రోజు వరకు విన్నాను. కానీ ఇప్పుడు వీరు దేశంలో పాఠశాలలు తెరిచిన వారిని మాత్రమే జైల్లో పెట్టడం ప్రారంభించారు’’ అని సిసోడియా ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ ప్రత్యక్షమైంది. దీంతో సిసోడియా ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని బగ్గా ఎలన్ మస్క్ ను కోరారు.
కాగా లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆప్ సీనియర్ నేత సిసోడియా మార్చి 20 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బయట బీజేపీ, ఆప్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సిసోడియా భద్రతపై ఆప్ ఆందోళన వ్యక్తంచేసింది. ఆ జైలులో ఉన్న సిసోడియా కరడు కట్టిన ఖైదీల మధ్యలో ఉన్నారని కాబట్టి అతని ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ , ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశారు. సిసోడియాకు విపాసన సెల్ ను నిరాకరించారని ఆప్ నేతలు ఆరోపించారు. ‘‘మనీష్ సిసోడియాను జైలులోని విపాసన సెల్ లో ఉంచాలని ఆప్ కోరింది. ఆప్ నేతల వినతికి కోర్టు ఆమోదం తెలిపింది. కానీ..ధర్మాసనం అనుమతి ఉన్నప్పటికీ సిసోడియాను జైలు నంబర్ 1లో నేరస్థుల వద్ద ఉంచారని దీనికి కేంద్రం సమాధానం చెప్పాలని ఆప్ ఎమ్మెల్యే భరద్వాజ్ డిమాండ్ చేశారు.
ఆప్ నేతలు ఆరోపణలపై తీహార్ జైలు అధికారులు స్పందించారు. ఆప్ నేతలు చేసే ఈ ఆరోపణలు సరైనవి కావని తోసిపుచ్చారు. మాజీ ఉప ముఖ్యమంత్రిని తీహార్ సెంట్రల్ జైలు నంబర్ 1 లోని ఒక వార్డులో ఉంచామని..అక్కడ అతి తక్కువ సంఖ్యలో ఖైదీలు ఉన్నారని.. గ్యాంగ్‌స్టర్ వంటి ఖైదీలు లేరని స్పష్టం చేస్తూ జైలు యంత్రాంగం ప్రకటించింది. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ప్రత్యేక వార్డుకు కేటాయించామని వెల్లడించింది. ఇక్కడ ఉన్న వారంతా తక్కువ సంఖ్యలో ఖైదీలో ఉన్నారని..వీరంతా గ్యాంగ్ స్టర్లు కారని..ఇక్కడున్నవారంతా మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని తెలిపింది.
జైలు నిబంధనల ప్రకారం సిసోడియాకు అన్ని ఏర్పాట్లు చేశామని..ఆయనకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధ్యానం వంటి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యకలాపాలు చేసుకునే అవకాముందని తెలిపారు. నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని ఇటువంటి ఆరోపణలు నిరాధారమైనవి జైలు అధికారి తెలిపారు. కాగా..లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాకు భగవద్గీత, కళ్ళద్దాలతో పాటు అవసరమైన మందులను జైలుకు తీసుకెళ్లడానికి కోర్టు అనుమతించింది. అలాగే సిసోడియా విజ్ఞప్తి మేరకు ధ్యానం చేసుకోవడాటానికి కూడా అనుమతి ఇచ్చింది. అతని అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని తీహార్ అధికారులకు కోర్టు ఆదేశించింది.