గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం..కాంగ్రెస్ చీఫ్,సీఎల్పీ నేత రాజీనామా

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం..కాంగ్రెస్ చీఫ్,సీఎల్పీ నేత రాజీనామా

Local polls గుజరాత్​లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢాంకా మోగించింది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలు,జిల్లా పంచాయతీలు,తాలుకా పంచాయతీలు కలిపి.. 237స్థానాలు ఏకగ్రీవం కాగా మిగిలిన 8,474స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన ఫలితాలను బట్టి..మొత్తం 8474 స్థానాలకు గాను బీజేపీ 6,110స్థానాల్లో విజయం సాధించగా,కాంగ్రెస్ 1768స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 81 మున్సిపాలిటీల్లో కేవలం 3మున్సిపాలిటీలను,231 తాలుకా పంచాయితీల్లో పదుల సంఖ్యలో స్థానాలను మాత్రమే కాంగ్రెస్ గెల్చుకోగలిగింది. ఇక,ఒక్క జిల్లా పంచాయత్ లో ఖాతా కూడా తెరువలేకపోయింది.

బీజేపీ విజయదుందుభి మోగించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోడీ చేసిన ఓ ట్వీట్ లో… గుజరాత్​లో నగర పాలక, తాలూక పంచాయతీ​, జిల్లా పంచాయతీ ఎన్నికలు.. బీజేపీ అభివృద్ధి, సుపరిపాలన అజెండాతోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. బీజేపీ పట్ల తిరుగులేని విశ్వాసం, బంధాన్ని కలిగి ఉన్నందుకు గుజరాత్​ ప్రజలకు నమస్కరిస్తున్నా అని తెలిపారు.

ఇక, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మంగళవారం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ను తుడిచిపెట్టారు మరియు దానిని ప్రతిపక్షంలో ఉండటానికి కూడా తగినట్లుగా పరిగణించని స్థాయికి తగ్గించారు అని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా గుజరాతీలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి, నమ్మకాలకు నిదర్శనంగా నిలిచే బీజేపీ పట్ల నమ్మకం ప్రదర్శించిన గుజరాతీలకు ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ పార్టీ చతికిలబడిన క్రమంలో ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్​ చావ్​డా, రాష్ట్ర సీఎల్​పీ నేత పరేశ్​ ధనాని తమ పదవులకు రాజీనామా చేశారు. మా అంచనాలకు విరుద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం. పార్టీ అధ్యక్షుడిగా ఓటమిని అంగీకరిస్తున్నా. ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతుంది అని అమిత్​ చావ్​డా తెలిపారు.