సింఘు బోర్డర్ లో టెన్షన్, రైతులపై రాళ్లు విసురుతున్న స్థానికులు

సింఘు బోర్డర్ లో టెన్షన్, రైతులపై రాళ్లు విసురుతున్న స్థానికులు

farmers at Singhu border : రైతుల పోరాటం..అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎలాంటి హింస చెలరేగిందో అందరికీ తెలిసిందే. ఓ వ్యక్తి మరణించడం, అధిక సంఖ్యలో పోలీసులకు గాయాలు కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు సంఘాలు ఆందోళనల నుంచి తప్పుకున్నాయి. ఇదిలా ఉంటే..రైతుల చేస్తున్న పోరాటాన్ని స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారులపై ఆందోళన చేయడం మూలంగా…తాము సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని వెల్లడిస్తున్నారు.

ఢిల్లీ – హర్యానా – సింఘు సరిహద్దు వద్ద గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..రెండు నెలల నుంచి వారు నిరసనలు చేపడుతున్నారు. ప్రధానంగా..సింఘు సరిహద్దు వద్ద నిరసనలు చేపడుతుండడంతో..తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వెల్లడిస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారు..దుకాణాలు నిర్వహిస్తున్న వారు..ప్రజలు రైతులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

2021, జనవరి 29వ తేదీ శుక్రవారం ఉదయం…స్థానికులు, రైతులతో వాగ్వాదానికి దిగారు. ప్రాంతాన్ని ఖాళీ చేయాలని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. దుకాణాలు తెరుచుకోవడానికి, వాహనాలు నడుపుకోవడానికి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. రైతులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది. రైతులపై రాళ్లు విసిరారు. అక్కడనే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కిసాన్ గణతంత్ర పరేడ్ తర్వాత..భద్రతా బలగాలను అధికంగా పెంచారు. సెంట్రల్ ఢిల్లీ వైపు వీరంతా మోహరించారు. ప్రస్తుతం సింఘు వద్ద నిరసనలు చెలరేగుతుండడంతో హర్యానా మీదుగా..సింఘు సరిహద్దు మీదుగా వచ్చే వాహనాలు అన్నీ నిలిచిపోయాయి.