రాజధానిలో తెరుచుకోనున్న షాపులు..లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నామన్న కేజ్రీవాల్

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 02:48 PM IST
రాజధానిలో తెరుచుకోనున్న షాపులు..లాక్ డౌన్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నామన్న కేజ్రీవాల్

దేశ రాజధానిని రీ-ఓపెన్ చేసే సమయం వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశం రెండు వారాల లాక్‌డౌన్ మూడో దశలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో పరిమిత ఆంక్షలతో అనుమతించే సేవలు, పరిశ్రమల జాబితాను ఆయన ఇవాళ ఆన్ లైన్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. ఢిల్లీని తిరిగి తెరిచే సమయం ఆసన్నమైందని,కంటైన్మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేసేందుకు ఢిల్లీ సిద్ధంగా ఉందని అన్నారు.

లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత కొన్ని కేసులు వెలుగుచూస్తే ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్‌ ప్రకటించారు. సోమవారం నుంచి ఢిల్లీలో అన్ని నాన్-ఎసెన్షియల్(నిత్యావయేతర) సహా స్వతంత్ర షాప్స్(Standalone shops)తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అయితే అన్ని మాల్స్,మార్కెట్ ప్లేస్ లు,షాపింగ్ కాంప్లెక్స్ లు యధావిధిగా మూసివేయబడి ఉంటాయన్నారు.

ప్రజారవాణా మూసే ఉంటుందని, ప్రైవేటు వాహనాలు, కార్లు, ద్విచక్ర వాహనాలు తిరుగుతాయని అన్నారు. కార్లలో ఇద్దరికి, ఒక డ్రైవర్‌కి అనుమతి ఉంటుందని, ద్విచక్ర వాహనంలో ఒక్కరే ప్రయాణించాలన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ తో సహా కార్యాలయాలు తెరుచుకోవచ్చని, అయితే 33 శాతం సిబ్బందినే  అనుమతించాల్సి ఉంటుందని అన్నారు. ఐటీ హార్డ్‌వేర్ తయారీ, నిత్యావసర వస్తువులకు సంబంధించిన ఈ-కామర్స్ కార్యకాలాపాలు కేజ్రీ ప్రకటించిన జాబితాలో ఉన్నాయి.

వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మంది చొప్పున అనుమతి ఉంటుందని చెప్పారు. సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్ములు వేసేవారిపై  ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన హెచ్చరించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, పనిమనుషులు, వంటి స్వయం ఉపాధి(సెల్ఫ్ ఎంప్లాయిడ్) గల వ్యక్తులను కూడా సోమవారం నుంచి పనిచేసుకోవడానికి అనుమతించనున్నట్లు సిఎం ప్రకటించారు.

అయితే బార్బర్ షాప్స్,సెలూన్స్,స్పా లు తెరుచుకునేందుకు మాత్రం అనుమతివ్వట్లేదని తెలిపారు. స్టేషనరీ షాపులు తిరిగి తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. కేంద్రహోంశాఖ నిర్ణయించిన అన్ని గైడ్ లైన్స్ ను ఢిల్లీ ప్రభుత్వం అములుచేస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. మార్చి 24న లాక్‌డౌన్‌కు కేంద్రం తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైనదని కేజ్రీవాల్ అన్నారు. లాక్‌డౌన్‌ను అమలు చేయకుండా ఉంటే దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు.

లాక్‌డౌన్‌ కొనసాగింపు, ఆదాయం పడిపోవడంపై ప్రధానంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఆర్థిక పరిస్థితి గడ్డుగా మారినందున లాక్‌డౌన్‌ను ఎక్కువ కాలం కొనసాగించలేమని అన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో రూ.3,500 కోట్లు ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.300 కోట్లకు పడిపోయిందని, ప్రభుత్వం నడిచేదెలా అని ఆయన ప్రశ్నించారు.