లాగుడు బండిపై నిండు గర్భిణి..మండు వేసవి..ఎర్రటి ఎండలో 700ల కి.మీటర్ల ప్రయాణం: లాక్ డౌన్ దీనగాథ

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 01:09 PM IST
లాగుడు బండిపై నిండు గర్భిణి..మండు వేసవి..ఎర్రటి ఎండలో 700ల కి.మీటర్ల ప్రయాణం: లాక్ డౌన్ దీనగాథ

ఎంత కష్టం ఎంత కష్టం. వలస వచ్చిన వలస కూలీకి ఎంత కష్టం అని యుగకవి శ్రీ శ్రీ అన్న మాటలు ఈ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కూలీల జీవితాలు కళ్లకు కడుతున్నాయి.కన్నీరు తెప్పిస్తున్నాయి. అటువంటి మరో దీనగాదే ఈ వలస కూలీ కుటుంబానిది. 
 

కడుపు చేతపట్టుకుని రెక్కల్ని నమ్ముకుని ఉన్నఊరు వదిలి పొరుగు రాష్ట్రాలు వలస వచ్చిన కూలీలకు లాక్‌డౌన్‌ మోయలేని భారాన్నే కాదు బ్రతటం కూడా కష్టమనిపించేలా చేస్తోంది. ఇంటికి ఏ కష్టం వచ్చినా అది మహిళలపైనే పడుతుంది. అందునా గర్భంతో ఉన్న ఈ మహిళా వలస కూలీ పరిస్థితి మరింత నరగప్రాయంగా మారింది.

అసలే కూలి బతుకులు. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. అటువంటిది లాక్ డౌన్ తో వలస వచ్చిన ప్రాంతాలను వదిలి ఉన్నఊరికి పయనమన ప్రయాణంలో వందల కిలోమీటర్లు నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. నెత్తిన సంచి..చంకలో బిడ్డ, భుజాన మరో సంచి వేసుకుని నిండు గర్భంతో భర్తతో కాలి నడకన ఎర్రటి ఎండలో 700 కిలోమీటర్ల నడక ప్రారంభించింది ఆ గర్భిణి దీనగాథ.

మధ్యప్రదేశ్‌కు చెందిన రాము భార్య, కూతురితో హైదరాబాద్‌కు వలసొచ్చాడు. లాక్‌డౌన్‌ తో పనులే లేవు. ఉపాధి కరువైంది. వచ్చిన ఊరు భారమైంది. కన్నఊరు పోదామనుకున్నారు, రాము భార్య గర్భిణి. మధ్యప్రదేశ్‌లోని సొంతూరుకు వెళ్లాలని ఆ దంపతులు రోడ్డు బాట పట్టారు.  అప్పటికే వందల కిలోమీటర్లు నడిచిన ఆ గర్భిణీ అలసిపోయింది. కాలు కదపలేనంది.

దీంతో రాము కర్రలు, చెక్కతో ఓ లాగుడు బండిని తయారు చేశాడు. ఆ లాగుడు బండిపై గర్భిణితో పాటు కూతర్ని కూర్చోపెట్టి..వారిని లాగుకుంటూ నడక సాగించాడు. మార్గమధ్యలో పోలీసులు వారికి బిస్కెట్లు, ఆహారంలాంటివి ఇచ్చారు. అలా రాము కుటుంబం మంగళవారం (మే 12,2020)మధ్యాహ్నం రాము కుటుంబం సొంతూరికి చేరుకుంది. 

సొంతూరిలోకి అడుగుపెట్టేసరికి అబ్బా..బతికాంరా బాబూ అని ఊపిరి పీల్చుకుందా కూలీ కుటుంబం. అదే కన్నఊరి గొప్పదనం. పొట్టకూటికోసం పొరుగు ఊర్లు..పొరుగు రాష్ట్రాలు..పొరుగు దేశాలు వెళ్లినా మనస్సు మాత్రం సొంతఊరివైపే లాగుతుంది. ఏ కష్టమొచ్చిన సొంత ఊరే గుర్తుకొస్తుంది. 
అలా ఊరు చేరుకున్న రామూ కుటుంబానికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు.14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు. అయినా సరే సొంత ఊరిలో ఉండటం కష్టం కాదంటున్నారు రాము కుటుంబం.