Lockdown మే 31వరకూ పొడిగింపు.. గైడ్ లైన్స్‌లో కొత్త పర్మిషన్లు

  • Published By: Subhan ,Published On : May 17, 2020 / 02:41 PM IST
Lockdown మే 31వరకూ పొడిగింపు.. గైడ్ లైన్స్‌లో కొత్త పర్మిషన్లు

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 31 వరకు కేంద్రం పొడిగించింది. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్న నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌‌డీఎంఏ) పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ 4.0 మార్గదర్శకాలను హోంశాఖ విడుదల చేసింది. రైలు, విమాన, మెట్రో సర్వీసులపై మే 31 వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టంచేసింది. అదే సమయంలో కంటైన్‌మెంట్‌ జోన్ల మినహా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు వెసులుబాటు కల్పించింది. అయితే, రాష్ట్రాల పరస్పర అంగీకారంతో వీటిని నడుపుకోవచ్చని హోంశాఖ స్పష్టంచేసింది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది. మెట్రో రైలు సేవలు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. డోర్ డెలివరీ చేసే వాటికి మాత్రమే పర్మిషన్ ఉంది. వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది. 

సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు నో పర్మిషన్. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు. మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.

కంటైన్మెంట్‌ జోన్లలో అత్యవసర సేవలు మినహా ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు. ప్రజలు రోడ్లమీదకు రాకూడదు. కంటైన్మెంట్‌ జోన్లలో ప్రతి ఇంటిపైనా నిఘా ఉంటుంది. అవసరమైన వైద్య పరీక్షలు, సేవలు అందించాలి. 65 ఏళ్లు పైబడిన వారు, గర్భిణీ స్త్రీలు, 10 ఏళ్లలోపు చిన్న పిల్లలను తప్పనిసరి అయితే తప్ప ఇంటి నుంచి బయటికి రానీయవద్దు. 

రాత్రి కర్ఫ్యూ
రాత్రి 7గం. నుంచి ఉదయం 7గం. వరకూ కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. (అత్యవసర సేవలు మినహా) ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. అన్ని ప్రాంతాల్లోనూ 144వ సెక్షన్‌ అమలు చేయాలి.