లాక్ డౌన్ వేళ టెర్రస్‌పై పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 2 విన్నర్ అశుతోష్ కౌశిక్

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 07:56 AM IST
లాక్ డౌన్ వేళ టెర్రస్‌పై పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 2 విన్నర్ అశుతోష్ కౌశిక్

బిగ్ బాస్ సీజన్ 2 విజేత అశుతోష్ కౌశిక్ లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్ కు చెందిన అర్పితను ఆదివారం(ఏప్రిల్ 26, 2020) న అశుతోష్ వివాహాం చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్ ఇంటి టెర్రస్ పై జరిగిన వివాహ వేడుకకు పురోహితుడు తో పాటు కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. వారిలో వరుడి తల్లి, సోదరి, వధువు తల్లి, సోదరుడు ఉన్నారు. ఈ పెళ్లికి  సంబంధించిన వీడియోలను అశుతోష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అశుతోష్ ఒక తెల్ల చొక్కా, వధువు ఎరుపు రంగు దుస్తులను ధరించినట్లు వీడియోలో కనిపిస్తుంది. పురోహితుడు చేతులకు గ్లౌజ్ లను, ముఖాన్నికి మాస్క్ ధరించి పెళ్లి వేడుకను జరిపించారు. ఈ వివాహానికి కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకున్నట్లు తెలుస్తుంది. మరికొందరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివాహాన్ని వీక్షించారు. 

అశుతోష్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ ముందే తమ వివాహం తేదీని నిర్ణయించాం. అంతేకాకుండా అక్షయ తృతీయా అనేది కొత్త ప్రారంభాలకు శుభ సూచికంగా భావిస్తాం. కాబట్టి ఫిబ్రవరిలో మేము ఆ తేదీని నిర్ణయించాం అన్నారు. లాక్ డౌన్ ఉన్న మేము ఆ తేదీన వివాహాం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలా తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకోవడం ద్వారా ఆదా అయిన డబ్బులను పీఎం కేర్స్‌కు విరాళంగా ఇవ్వనున్నట్టు అశుతోష్‌ తెలిపారు.

అంతేకాకుండా వధువు తల్లిదండ్రులను పెళ్లి కోసం దాచిపెట్టిన డబ్బును విరాళంగా ఇవ్వమని కోరినట్లు తెలిపారు. అయితే ఎంత మెుత్తం ఇవ్వనున్నారో వెల్లడించలేదు. టెలివిజన్‌ రియాలిటీ షో స్టార్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశుతోష్‌ కౌశిక్ రోడిస్‌ సీజన్‌ 5, బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టైటిల్స్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. జిలా ఘజియాబాద్, కిస్మత్ లవ్ పైసా దిల్లీ వంటి చిత్రాల్లోను నటించాడు.