స్పెషల్ స్టేటస్ ఇచ్చారు : నామినేషన్ లో సోషల్ మీడియా వివరాలు

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 05:04 AM IST
స్పెషల్ స్టేటస్ ఇచ్చారు : నామినేషన్ లో సోషల్ మీడియా వివరాలు

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. యువతను ఆకర్షించేందుకు స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో సోషల్ మీడియాపైనా ఈసీ నిఘా పెట్టింది. ఆయా పార్టీల ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లకు సంబంధించి అన్ని వివరాలు తెలిపాలని ఆదేశించారు సీఈసీ సునీల్ అరోరా.

సోషల్ మీడియాను ప్రధాన ఆయుధంగా వినియోగించుకుంటూ.. విమర్శలు, ఆరోపణలే కాకుండా సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, నాయకులు ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఏపీలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య యుద్ధమే నడుస్తోంది. ఈ ప్రచారానికి రాజకీయ పార్టీలు, నాయకులు చేస్తోన్న ఖర్చుపై ఈసీ ఇప్పుడు దృష్టి పెట్టింది. 

నామినేషన్ వేసే అభ్యర్థులు తమ సోషల్ మీడియా అకౌంట్ల వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందని సీఈసీ సునీల్ అరోరా స్పష్టంచేశారు. సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు, నాయకులు ప్రకటనలు ఇవ్వదలుచుకుంటే ముందుగా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రచార ప్రకటనల ఖర్చులను మాత్రమే ఈసీ పరిగణనలోకి తీసుకునేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రకటనలకు ఖర్చుచేసిన మొత్తాన్ని పార్టీలు తమ ఎన్నికల ప్రచార ఖర్చుల్లో జత చేసి ఈసీకి లెక్క చూపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యూట్యూట్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో మాట్లాడామని.. ఎంసీఎంసీ సర్టిఫికేషన్ ఉన్న ప్రకటనలను మాత్రమే అవి అనుమతిస్తాయని సీఈసీ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, నాయకులకు ఇది ఇబ్బంది పెట్టే అంశమే.