రూ.12 కోట్ల ఎఫెక్ట్ : వేలూరు పోలింగ్ రద్దు

  • Published By: madhu ,Published On : April 16, 2019 / 02:41 PM IST
రూ.12 కోట్ల ఎఫెక్ట్ : వేలూరు పోలింగ్ రద్దు

ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్రం వేలూరు లోక్ సభ నియోజకవర్గం పోలింగ్ రద్దు చేసింది. DMK పార్టీ నేతకు సంబంధించిన రూ.12 కోట్ల డబ్బు పట్టుబడడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దుకు ముందుకు విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేసి.. అనుమతి తీసుకుంది ఈసీ. ఏప్రిల్ 16వ తేదీన ఈసీ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇక్కడ ఏప్రిల్ 18న పోలింగ్ జరగాల్సి ఉంది. 

ఈ నియోజకవర్గం నుంచి DMK కోశాధికారి దురైమురుగన్ కుమారుడు కదిర్ ఆనంద్ పోటీ చేస్తున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థి ఏసీ షణ్ముగం, మక్కల్ నీది మయ్యం తరపున ఆర్.సురేష్‌తో సహా 23 మంది బరిలో ఉన్నారు. మార్చి 30వ తేదీన ఐటీ అధికారులు వేలూరు జిల్లా కాట్పాడిలోని దురైమురుగన్ నివాసంలో తనిఖీ చేశారు. లెక్కలు తేలని రూ.10 లక్షల డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులకే కాట్పాడిలోని డీఎంకే నేతకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీలో నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొత్తం లెక్కిస్తే 11 కోట్ల 53 లక్షలని తేలింది. 

ఓటర్లకు డబ్బులు పంచేందుకు నేతలు సిద్ధమయ్యారని ఐటీ అంచనా వేసింది. సోదాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ సమాచారాన్ని అక్కడి ఈసీకి తెలియచేసింది. ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. దానిని పరిశీలించిన తర్వాత.. ఎన్నికను రద్దు చేస్తే బెటర్ అని ఫైనల్‌గా నిర్ణయం తీసుకుంది ఈసీ. ఎన్నికను రద్దు చేయాల్సిందిగా రాష్ట్రపతికి పంపడం..ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం చకచకా జరిగిపోయాయి.