రెండవ దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

  • Published By: vamsi ,Published On : April 18, 2019 / 01:49 AM IST
రెండవ దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల సమరంలో లోక్‌సభ రెండవ దశ పోలింగ్‌ ప్రారంభం అయింది.  దేశంలోని 11 రాష్ట్రాల్లోని 95 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇవాళ(18 ఏప్రిల్ 2019) పోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తుంది.

ఉదయం 7గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మొత్తం 1,611 మంది అభ్యర్థులు రెండవ విడత ఎన్నికల బరిలో ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు తమిళనాడులో ఖాళీగా ఉన్న 18అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలో ఒక శాసనసభ స్థానంకు, ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్‌సభ స్థానం ఎన్నిక మూడో దశకు (ఏప్రిల్‌-23)కు వాయిదా పడడంతో రెండు స్థానాలు తగ్గాయి.

ఇక కర్నాటకలో 14పార్లమెంటు స్థానాలకు, మహారాష్ట్రలో 10పార్లమెంటు స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. అస్సాం, బీహార్, ఒడిషా రాష్ట్రాల్లో ఐదు చొప్పున పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఛత్తీస్‌ఘడ్‌, వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రాలలో మూడు చొప్పున లోక్‌సభ సీట్లకు, జమ్మూ కాశ్మీర్‌లో రెండు, మణిపూర్, త్రిపుర, పాండిచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతుంది. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.