Mehbooba Mufti : కశ్మీర్ ని అప్ఘానిస్తాన్ తో పోల్చిన ముఫ్తీ..మారకపోతే మీకూ అదే గతి అంటూ కేంద్రానికి హెచ్చరిక

జమ్ముకశ్మీర్‌ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Mehbooba Mufti : కశ్మీర్ ని అప్ఘానిస్తాన్ తో పోల్చిన ముఫ్తీ..మారకపోతే మీకూ అదే గతి అంటూ కేంద్రానికి హెచ్చరిక

Mufti Centre

Mehbooba Mufti జమ్ముకశ్మీర్‌ను ప్రస్తుత తాలిబన్ల ఆక్రమణలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్ఘానిస్తాన్‌ పరిణామాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని..జమ్ముకశ్మీర్‌ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దంటూ కేంద్రప్రభుత్వాన్ని ముఫ్తీ హెచ్చరించారు.

శనివారం కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ముఫ్తీ మాట్లాడుతూ..పొరుగు దేశంలో(అప్ఘానిస్తాన్) ఏం జరిగిందో చూడండి..సూపర్‌ పవర్‌ అమెరికా తట్టాబుట్టా సర్దుకొని అఫ్గాన్‌ నుంచి తోక ముడిచింది.. పరిస్థితిని అర్థం చేసుకొని చట్ట విరుద్ధంగా జమ్ముకశ్మీర్‌ను ఏ విధంగా ముక్కలు చేశారో, ఆ తప్పును సరిదిద్దాలని కేంద్రానికి ముఫ్తీ సూచించారు. కశ్మీర్‌లో చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి భారత ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పారు. వాజ్‌పేయీ ఎలాగైతే జమ్మూకశ్మీర్‌పై అటు పాకిస్తాన్ తో,ఇటు స్థానిక కశ్మీర్ నేతలతో చర్చలు జరిపారో అలాగే ఇప్పుడు మోదీ సర్కార్ కూడా చర్చల ప్రక్రియను ప్రారంభించాలని ముఫ్తీ అన్నారు.

జమ్మూకశ్మీర్‌లోని భాగస్వామ్య పక్షాలతో కేంద్రం చర్చలు జరపాలన్న ముఫ్తీ.. 2019లో రద్దు చేసిన జమ్మూకశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి(ఆర్టికల్ 370)ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించి కేంద్రం తన తప్పును దిద్దుకోకపోతే అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన పరిస్థితే కేంద్రప్రభుత్వానికి కూడా పడుతుందని హెచ్చరించారు. జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎంతో ఓపిక వహిస్తున్నారని.. వారి సహనాన్ని పరీక్షించవద్దని కేంద్రానికి సూచించారు. వారి ఓపిక నశిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఉండదని..కనుమరుగైపోతుందని హెచ్చరించారు.

అయితే జమ్ముకశ్మీర్‌ను తాలిబన్ల ఆధీనంలోని అప్ఘానిస్తాన్ తో పోలుస్తూ మెహబూబా ముఫ్తీ చేసిన వివాదస్పద వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ముఫ్తీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జమ్మూకశ్మీర్‌ బీజేపీ అధ్యక్షుడు రవీందర్‌ రైనా..భారత్‌ పట్ల మెహబూబాకు దురభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. దేశానికి వ్యతిరేకంగా మెహబూబా ముఫ్తీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని..కానీ కశ్మీర్‌ ప్రజలు మాత్రం దేశభక్తులుగా జాతీయ జెండాను ఎగురేస్తున్నారని తెలిపారు. భారత్‌ ఓ శక్తిమంతమైన దేశమని. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు తాలిబన్‌, అల్‌ఖైదా, లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్‌ వంటి తీవ్రవాద సంస్థలను నాశనం చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని రవీందర్‌ రైనా పేర్కొన్నారు.