ప్రభుత్వంపై నమ్మకం పోయింది: హైకోర్టు

ప్రభుత్వంపై నమ్మకం పోయింది: హైకోర్టు

తమిళనాడు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయామంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో అక్రమ హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించింది. పబ్లిసిటీ కోసం చేసిన పనుల కారణంగా చెన్నైలో 23ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయింది. 

‘మన దేశంలో ప్రాణాలకు సున్నా విలువ మాత్రమే ఉంది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే. మాకు ప్రభుత్వంపై నమ్మకం పోయింది’ అని జస్టిస్ శేషసాయి మీడియాకు వెల్లడించారు. కోర్టు ఇప్పటికే అక్రమ హోల్డింగ్‌లు పెట్టవద్దని, అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆర్డర్లు ఇచ్చి అలసిపోయినట్లు వివరించారు. 

డీఎమ్‌కే చీఫ్ ఎంకే స్టాలిన్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. ‘సుభశ్రీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వైఫల్యం కూడా దీనికి కారణం. అక్రమంగా హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి మరో ప్రాణం పోయేందుకు కారణమయ్యారు. ఇంకెంత మంది ప్రాణాలు మీ అధికార దాహానికి బలి అవ్వాలి’ అని ప్రశ్నించారు. 

గురువారం(సెప్టెంబర్-12,2019)సాయంత్రం దక్షిణ చెన్నైలో స్కూటీపై ఇంటికి వెళుతున్న సుభశ్రీపై అధికార పార్టీ ఏఐఏడీఎంకే పార్టీ బ్యానర్ ఒక్కసారిగా పడింది. ఆమె బ్యాలెన్స్ కోల్పోవడంతో బైక్‌పై నుంచి పడిపోయింది. అప్పుడే వేగంగా వస్తున్న వాటర్ ట్యాంకర్ మహిళపై నుంచి దూసుకెళ్లడంతో సుభశ్రీ ప్రాణాలు కోల్పోయింది.