సామాన్యుడిపై మరో బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, 3 నెలల్లో రూ.200 పెంపు

సామాన్యుడిపై మరో బాదుడు.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర, 3 నెలల్లో రూ.200 పెంపు

LPG price hike again: అసలే రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రో ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ధరల పోటు తట్టుకోలేక సతమతం అవుతున్నాడు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు వంట గ్యాస్ కూడా గుదిబండగా మారింది. మరోసారి గ్యాస్ సిలిండర్ పెరిగింది.

మూడు నెలల్లో రూ.200 పెంపు:
వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరో రూ.50 పెరిగింది. ఫిబ్రవరి నెలలో వడ్డన ఇది రెండోసారి. గడిచిన మూడు నెలల్లో సిలిండర్‌ ధర ఏకంగా రూ. 200 పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సోమవారం(ఫిబ్రవరి 15,2021) నుంచి గృహావసరాలకు(డొమిస్టిక్-14.2కేజీ) గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునే వారు అదనంగా మరో రూ.50 చెల్లించాల్సిందే. తాజా పెంపుతో సిలిండర్‌ ధర రూ. 821.50కు చేరింది. 2020 డిసెంబర్ లో రెండు దఫాలుగా రూ.100, 2021 జనవరిలో మరో రూ.25, ఫిబ్రవరి నెలలో రెండు దఫాలుగా రూ.75 పెంచారు. ఒకవైపు పెట్రోధరల పెంపుతో నడ్డి విరిగిపోతుండగా మరోవైపు తరచుగా పెరుగుతున్న గ్యాస్‌ ధరలు జనం బడ్జెట్‌ను తలకిందులు చేసేస్తున్నాయి.

15 రోజులకోసారి బాదుడు:
కొన్నేళ్లుగా అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ఆధారంగా చమురు సంస్థలు ధరలను సవరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పెట్రోలు, డీజిల్‌ ధరలు రోజువారీగా పెరుగుతున్నాయి. అదే ఫార్ములాను వంట గ్యాస్‌ కి అప్లయ్ చేశాయి చమురు కంపెనీలు. వీటి ధరలను కూడా అలాగే పెంచేందుకు చమురు సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. దశలవారీగా 15 రోజులకు ఒకసారి కానీ, వారానికి ఒకసారి కానీ ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. అందులో భాగంగానే 15వ తేదీ నుంచి గ్యాస్‌ ధర పెంచుతూ చమురు సంస్థలు డీలర్లకు ఆదివారం(ఫిబ్రవరి 14,2021) రాత్రి సమాచారం పంపాయి. పరిస్థితుల చూస్తుంటే ఇక నుంచి 15 రోజులకోసారి గ్యాస్‌పై బాదుడు తప్పేలా లేదు.

గ్యాస్ సబ్సిడీకి మంగళం:
ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ధరలు పెంచాల్సి వస్తోందని చమురు కంపెనీలు అంటున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ నష్టాల్లో నుంచి బయటపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. మరోవైపు గ్యాస్ సిలిండర్ పై ఇచ్చే సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు వందల రూపాయల సబ్సిడీ పడేది. ఇప్పుడు 40 రూపాయలు మాత్రమే కస్టమర్ల అకౌంట్లలో పడుతోంది. అది కూడా కొంతమందికి మాత్రమే. మొత్తంగా గ్యాస్ సబ్సిడీ విధానానికి మంగళం పాడాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 4న మెట్రో నగరాల్లో నాన్ సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25 పెంచిన సంగతి తెలిసిందే.

సెంచరీ కొట్టిన పెట్రోల్ ధర:
ఇది ఇలా ఉంటే.. చమురు కంపెనీలు వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి. ఇప్పటికే మెట్రో నగరాల్లో ఆల్‌ టైమ్‌ గరిష్ఠ స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి. పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వరుసగా 6వ రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 25 నుంచి 50 పైసలు, డీజిల్ పై 30 పైసల నుంచి 50 పైసల మేర పెంచుతూ…ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి.

మహారాష్ట్రలోని పర్బని జిల్లాలో పెట్రోల్ ధర భగ్గుమంది. అక్కడ పెట్రోల్ ధర సంచరీ చేసింది. ఎక్ట్రా ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.100 దాటినట్లు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సభ్యుడు తెలిపారు. సాధారణ పెట్రోల్‌ ధర రూ. 97.38గా ఉంది. వాణిజ్య నగరమైన ముంబైలో పెట్రోల్ పై 28 పైసలు పెరగడంతో రూ.95.21 చేరుకుంది. ఇక హైదరాబాద్ నగరంలో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 92.26, డీజిల్ ధర రూ. 86.23కి చేరింది.