సామాన్యుడిపై మరో భారం, వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

సామాన్యుడిపై మరో భారం, వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు

LPG price up by Rs 25: అసలే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుడిపై మరో భారం పడింది. ఇప్పుడు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. నాన్ సబ్సిడీ(రాయితీ లేని) సిలిండర్ ధరతో పాటు వాణిజ్య(కమర్షియల్) సిలిండర్ ధర పెంచుతూ చమురు కంపెనీలు ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.25 పెంచగా, కమర్షియల్ సిలిండర్(నాన్ సబ్సిడీ 19కిలోలు) పై రూ.184 పెంచాయి. ఈ ధరలు నేటి(ఫిబ్రవరి 4,202) నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే మెట్రో నగరాలకు మాత్రమే ఈ పెంపు పరిమితం.

ప్రస్తుతం ధరల పెంపు తర్వాత నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర (14.2 కిలోలు) దేశ రాజధాని ఢిల్లీలో రూ. 719కి చేరగా.. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735కి చేరింది. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.746.50 నుంచి రూ.771.50 కి చేరింది. జనవరిలో గ్యాస్ ధరలు పెంచకపోవడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే చమురు కంపెనీలు బాంబు పేల్చాయి. కాగా, గతేడాది(2020) డిసెంబర్ లో రెండు సార్లు గ్యాస్ సిలిండర్ ధర పెంచడంతో ఢిల్లీలో ఏకంగా వంద రూపాయల వరకు సిలిండర్ ధర పెరిగింది.

తాజా పెంపు తర్వాత ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్(19 కిలోలు) ధర రూ.1,533 అయ్యింది. ముంబైలో రూ.1,482.50, కోల్ కతాలో రూ.1,598.50, చెన్నైలో రూ. 1,649 అయ్యింది.

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 35పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసలు పెరిగాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.65గా ఉంది. డీజిల్ ధర రూ.76.83గా ఉంది.