పెళ్లి పేరుతో మోసం, యువతిని రేప్ చేసి వ్యభిచార ముఠాకి అమ్మేశాడు

  • Published By: naveen ,Published On : July 27, 2020 / 11:55 AM IST
పెళ్లి పేరుతో మోసం, యువతిని రేప్ చేసి వ్యభిచార ముఠాకి అమ్మేశాడు

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి బయటపడింది.

పెళ్లి పేరుతో వంచన:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలిది అస్సాం. ఆమె సోదరి హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. ఆమెని చూసేందుకు హైదరాబాద్ వెళ్లింది. అదే సమయంలో సోనూ అనే వ్యక్తి బాధితురాలి తల్లిదండ్రులను కలిశాడు. మీ కూతురిని పెళ్లి చేసుకుంటాను, బాగా చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు.

అహ్మదాబాద్ తీసుకెళ్లి అత్యాచారం, వ్యభిచార ముఠాకి అమ్మకం:
పెళ్లి పేరుతో యువతిని అస్సాం నుంచి అహ్మదాబాద్ తీసుకెళ్లాడు సోనూ. తల్లిదండ్రులు చెప్పడంతో సోనూని నమ్మి అహ్మదాబాద్ వెళ్లింది యువతి. అక్కడ సోనూ తన నిజస్వరూపం బయటపెట్టాడు. యువతిపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమెని వ్యభిచార ముఠా నడిపే మహిళకు అప్పగించాడు. సోనూ తీరుతో యువతి షాక్ కి గురైంది. తాను మోసపోయానని గ్రహించేలోపు ఘోరం జరిగిపోయింది.

చివరికి నరకకూపం నుంచి విముక్తి:
వ్యభిచార ముఠా నిర్వాహాకురాలు, యువతిని వ్యభిచారం నిమిత్తం పలు హాస్టళ్లకు తిప్పింది. అలా ఆ యువతి శరీరంతో వ్యాపారం చేసి డబ్బు సంపాదించింది. కొన్ని రోజులు బాధితురాలు నరకం చూసింది. మరో దారి లేక మౌనంగా ఉండిపోయింది. ఓ రోజు యువతి ఎలాగో ఫోన్ సంపాదించింది. వెంటనే 100కు డయల్ చేసి పోలీసుల సాయం కోరింది. అయితే ఆమెకు హిందీ సరిగా రాదు. దీంతో ఆ యువతి ఏం చెబుతుందో పోలీసులకు అర్థం కాలేదు. కానీ ఆమె ఆపదలో ఉన్నట్టు వారికి అర్థమైంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా లోకేషన్ ట్రేస్ చేశారు. ఆ యువతిని కాపాడారు. నరకకూపం నుంచి విముక్తి కల్పించారు. వ్యభిచార ముఠాను నడిపే మహిళ, సోనూలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.