మూకదాడులు మన సంస్కృతి కాదు…RSS ఛీఫ్ భగవత్

  • Published By: venkaiahnaidu ,Published On : October 8, 2019 / 08:47 AM IST
మూకదాడులు మన సంస్కృతి కాదు…RSS ఛీఫ్ భగవత్

మూకదాడులు భారత సంస్కృతి కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మూకదాడులు సహా హింస ఏరూపంలో ఉన్నా అది గర్హనీయమని, మూకదాడుల పదం ఎంతమాత్రం భారత్‌కు పొసగదని భగవత్ అన్నారు. మూకదాడులు పరాయి సంస్కృతి అని అన్నారు. మూకదాడులు వంటి కొన్ని సామాజిక హింసా ఘటనల వల్ల దేశానికి, హిందూ సమాజం ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, కొన్ని మతాల మధ్య భయాందోళనలకు దారితీస్తుందన్నారు. భారతదేశం భారతీయులందరిదీనని, ఇక్కడ అందరూ కలిసిమెలిసి సహజీవనం సాగిస్తుంటారని చెప్పారు. 

దసరా సందర్భంగా నాగ్ పూర్ లో మంగళవారం(అక్టోబర్-8,2019)ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ….సమాజంలోని భిన్న వర్గాలు పరస్పర సౌహార్ద్రం, చర్చలు, సహకారం కోసం పాటుపడాలన్నారు. ఇవాల్టి సమాజానికి ఇవి అనివార్యమని సూచించారు. పరస్పర సహకారం, కలిసి చర్చించుకునే వాతావరణాన్ని పాదుకొలిపేందుకు సంఘ్ స్వయంసేవక్‌లు కృషిచేయాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. 

భిన్నత్వం అనేది మన దేశానికి అంతర్గత శక్తి అని అన్నారు. కులం, మతం, భాష, ప్రాంతాల వైవిధ్యాన్ని స్వప్రయోజనాలకు వాడుకోవడం వల్ల విభేదాలకు తావిస్తుందని అన్నారు. అలాంటి స్వార్థ శక్తుల కుట్రలను గుర్తించి అప్రమతం కావాలని, వాటిని తిప్పికొట్టాలని అన్నారు. భిన్నాభిప్రాయాలు కావచ్చు, రెచ్చగొట్టే ప్రయత్నాలు కావచ్చు… ఎవరే చర్యకు పాల్పడినా అది రాజ్యాంగ పరిధిలోనే ఉండాలన్న విషయాన్ని సమాజం గుర్తెరగాలని ఆయన అన్నారు. ఆర్టికల్ 370రద్దుపై మోడీ సర్కార్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశంసలు కురించారు.ఆర్టికల్ 370రద్దు దేశ ప్రజల ఆకాంక్ష అన్నారు.