Madhya Pradesh High Court : శారీరక సంబంధంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రేమ పెళ్లి పేరుతో యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని భావించింది.

Madhya Pradesh High Court : శారీరక సంబంధంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Madhya Pradesh

young women physical relationship : ప్రేమ, పెళ్లి పేరుతో కొంతమంది యువకులు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. చాలా మంది అమ్మాయిలు యువకుల మాయ మాటలు నమ్మి వారితో శారీరకంగా దగ్గరవుతున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కానీ యువతులు కేవలం సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని, ఈ విషయంలో మగవాళ్లే పర్యవసనాలనెరిగి ప్రవర్తించాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

సంప్రదాయాలకు విలువ ఇచ్చే మన సమాజంలో పెళ్లి కానీ యువతులు దిగజారి ప్రవర్తించేంత స్థితికి ఇంకా చేరుకోలేదని జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది. పెళ్లి చేసుకుంటారని, ఏదో ఒక హమీ మీద తప్పించి.. సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని భావించింది. నిజాన్ని నిరూపించడానికి ప్రతిసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. అలా సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా తదుపరి పర్యవసానాలను కూడా గమనించాలని వ్యాఖ్యానించింది

ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 అక్టోబరు నుంచి ఓ యువతితో శారీరకంగా కలిశాడు. అయితే పెద్దలు ఒప్పుకోవడం లేదని, తాను వేరేవారిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జూన్‌ 2న ఆ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న యువతి నుంచి మహకల్‌ స్టేషన్‌ పోలీసులు స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు.

అయితే అదృష్టవశాత్తూ ఆ యువతి బతికింది. కాగా ఆ యువకుడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. అతను బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌కు చెందిన జస్టిస్‌ సుబోధ్‌ అభయంకర్‌ విచారణ చేపట్టారు.

ఆమెకు 21 ఏళ్లు నిండాయని, ఇష్ట ప్రకారమే సంబంధం పెట్టుకున్నామంటూ నిందితుడు చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. వేర్వేరు మతాలే వారి పెళ్లికి ఆటంకంగా మారాయన్న ప్రభుత్వ న్యాయవాది వాదనను బెంచ్‌ పరిగణనలోకి తీసుకుంది. దీంతో నిందితుడికి కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

అంతేకాకుండా పలు కేసుల ప్రస్తావన తీసుకొచ్చింది. ఇలాంటి వ్యవహారాల్లో కక్కుర్తిపడే మగవాళ్లే అనుమానితులుగా బయటపడ్డ సందర్భాలు అధికంగా ఉన్నాయని తెలిపింది. బాధితులకు అన్యాయం జరిగిన సందర్భాలే ఉన్నాయంటూ వ్యాఖ్యానించింది.