హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి..రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ

హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించండి..రాష్ట్రపతికి మహిళా రైతు లేఖ

Madhya Pradesh హెలికాఫ్టర్ కొనేందుకు లోన్ ఇప్పించాలని అదేవిధంగా ఫ్లయింగ్ లైసెన్స్ ఇప్పించాలని కోరుతూ ఓ మహిళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి లేఖ రాసింది. ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవడంతో చివరకి ఆ మహిళ కోరుకున్నది జరిగింది. అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆమె లేఖ రాయడానికి గల కారణాలేంటో చూద్దాం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసోర్ జిల్లా అగర్ గ్రామానికి చెందిన బసంతి బాయ్ లోహర్ ఒంటరి మహిళ. చిన్న పూరి గుడిసెలో ఉంటుంది. ఆమెకు ఊళ్లో 2 బిగాల భూమి ఉంది. అందులో పంట పండించి వచ్చిన డబ్బులతోనే జీవనం సాగిస్తోంది. బసంతి తన పొలంలోకి వెళ్లాలంటే…అదే గ్రామానికి చెందిన పరమానంద్ అనే రైతుకి చెందిన పొలం దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, బసంతి తన భూమిలోకి వెళ్లడానికి పరమానంద్ ఒప్పుకోవడం లేదు. ఆయన కొడుకులు కూడా బసంతిలో వాగ్వాదానికి దిగారు. తమను దాటుకుని లోపలికి వెళ్లడానికి వీళ్లేదని.. వెళ్తే ప్రాణాలతో తిరిగి రావని హెచ్చరించారు.

దీంతో భయపడిన బసంతి తన బాధను గ్రామంలోని పెద్దలతో, అధికారులతో చెప్పుకుంది. వారెవరూ ఆమెను పట్టించుకోలేదు. ఇంక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాసింది. రాష్ట్రపతికి రాసిన లేఖలో… నాకు రెండు బిగాల భూమి ఉంది. అదే నా జీవనాధారం. కానీ అందులోకి వెళ్లాలంటే గ్రామంలో భూస్వామి గా పేరున్న పరమానంద్ పాటిదార్ భూమి దాటి వెళ్లాలి. ఆయనతో పాటు ఆయన కొడుకులు నన్ను లోపలికి వెళ్లనివ్వడం లేదు. నా పొలంలోకి వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా పని కాలేదు. ఆ పొలం లేకుండా నాకు బతుకుదెరువు లేదు. కాలినడకన వెళ్లడానికి వాళ్లు వీళ్లేదంటున్నారు. దయచేసి నాకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇప్పించండి. అంతకుమించి నాకు వేరే మార్గం లేదని బసంతి రాసుకొచ్చింది.

ఈ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అయింది. చివరికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు విషయం చేరింది. దీంతో స్పందించిన ఆయన.. ఆ మహిళ సమస్యను తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.హెలికాప్టర్ కొనివ్వాల్సిన అవసరం లేదని.. తానే స్వయంగా ఆమె సమస్యకు పరిష్కారాన్ని చూపుతానని తెలిపారు