జయలలిత ఆస్తులు వారికే.. హైకోర్టు కీలక తీర్పు.. విలువ ఎంతంటే?

  • Published By: vamsi ,Published On : May 28, 2020 / 01:04 AM IST
జయలలిత ఆస్తులు వారికే.. హైకోర్టు కీలక తీర్పు.. విలువ ఎంతంటే?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చి తలైవి, అమ్మ జయలలిత ఆస్తులకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ బంగ్లాను స్వాధీనం చేసుకుని, అమ్మ స్మారక చిహ్నంగా మార్చడానికి తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. అది కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. 

జయ ఆస్తుల విషయంలో ఆమె మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ లను చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది హైకోర్టు. చనిపోయేంత వరకు జయలలిత పెళ్లి చేసుకోలేదని, అందువల్ల ఆమెకు దీప, దీపక్ తప్ప మరెవరూ చట్టబద్ధమైన వారసులు లేని కారణంగా.. జయ ఆస్తులు వీరిద్దరికే చెందుతాయని చెప్పింది. జయలలిత పేరు మీద రూ. 913 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

ఫలితంగా ఆమె నివాసం “వేద నిలయం” ఈ ఇద్దరు వారసుల అనుమతి లేకుండా స్మారక చిహ్నంగా మార్చబడదని తెలిపింది. ఆస్తుల నిర్వహణకు సంబంధించి దీపక్ మరియు మేనకోడలు దీపాకి పరిపాలనా లేఖను మంజూరు చేసింది హైకోర్టు. వేద నిలయం విలువ రూ. 100 కోట్లకు పైగానే ఉంటుంది. కోర్టు తీర్పును స్వాగతించిన దీపా, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం గురించి న్యాయ సలహా తీసుకుంటామని వెల్లడించింది.

Read: కోహ్లీ అనుష్కకు విడాకులు ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే