Madurai : వేడి, వేడి గంజి పాత్రలో పడి వ్యక్తి మృతి
తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది.

Madurai : తమిళనాడులో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామ దేవత జాతర ఉత్సవానికి ప్రజలు అన్నదానం చేస్తున్నారు. అందుకు తయారు చేసిన గంజి గిన్నెలో పడి ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మధురై జిల్లా సుబ్రహ్మణ్యపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పలంగానట్టి గ్రామంలోని గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్తులు గత నెలలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు తయారు చేస్తున్నారు.
ఆసమయంలో గ్రామానికి చెందిన ముత్తు కుమార్(54) అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. అక్కడకు వచ్చిన వెంటనే అతనికి తల తిరుగుతున్నట్టు అనిపించి పక్కనే ఉన్న పెద్ద వంట పాత్రను పట్టుకోటానికి ప్రయత్నించాడు. అలా పట్టుకోలేక దానిపై కూర్చోటానికి ప్రయత్నించి దానిపై కూర్చున్నాడు.
కానీ దానిపై మూత ఏమీ లేకపోవటంతో అదుపు తప్పి ఆ పాత్రలోకి పడిపోయాడు. అందులో అప్పటికే ఉడికించిన వేడి వేడి గంజి లాంటి ఆహారం ఉంది. ముత్తుకుమార్ దానిపై కూర్చుంటుంటే ఒక వ్యక్తి అతడిని హెచ్చరించాడు. అయినా ముత్తుకుమార్ దానిపై కూర్చునే క్రమంలో అందులో పడిపోయాడు. వేడి వేడి గంజి పాత్రలోంచి ముత్తు కుమార్ ను బయటకు తీసేందుకు అక్కడ ఉన్నవారు ప్రయత్నించారు. కానీ వేడి గంజి వారికి తగలటంతో వారు తీయలేక పోయారు.
మరోక వ్యక్తి కొంచెం గట్టిగా ప్రయత్నించి ముత్తు కుమార్ ను బయటకు లాగటానికి ప్రయత్నించాడు. మొత్తానికి గంజి పాత్ర ఒక పక్కకు ఒరగటంతో గంజితో సహా ముత్తు కుమార్ బయట పడ్డాడు. ఆ గంజిలో కాలు జారి మరోక ఇద్దరికి గాయాలయ్యాయి. స్దానికులు వెంటనే వారిని మధురైలోని రాజాజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముత్తు కుమార్ ఈనెల 2వ తేదీన మరణించాడు.
తన భర్త మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడని, వంటల దగ్గరికి వెళ్లేసరికి ఫిట్స్ రావడంతో బ్యాలెన్స్ తప్పి గంజి పాత్ర లోపల పడిపోయాడని ముత్తుకుమార్ భార్య సుబ్రమణ్యపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఈ ఘటన జులై 25 వ తేదీన జరిగినట్లు… ఆగస్టు2న సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వల్ల తెలుస్తోంది.