మహా తుఫాన్ బీభత్సం : తమిళనాడు, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : November 1, 2019 / 11:10 AM IST
మహా తుఫాన్ బీభత్సం : తమిళనాడు, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు

భారీ వర్షాలతో మహా తుఫాన్‌తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే క్యార్ తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాన్ అక్టోబర్ 31వ తేదీ గురువారం మరింత తీవ్రవైన తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. లక్ష ద్వీప్ మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి ఉత్తర – వాయువ్య దిశగా మహా తుఫాన్ పయనిస్తోంది. వచ్చే 12 గంటల్లో లక్ష ద్వీప్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయని హెచ్చరించించింది. తాజాగా ఇది ఎలాంటి ప్రళయం సృష్టిస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. 

అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తీవ్ర తుఫాను కేరళలోని కొచ్చి పట్టణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉవ్వెత్తున ఎగిసిపడుతన్న అలలకు తోడు తీవ్రంగా వీస్తున్న గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలల తాకిడికి తీరం పూర్తిగా దెబ్బతింది. తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫాను పెను తుఫానుగా మారే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది..

మహా తుఫాన్‌ తమిళనాడులో తీవ్ర ప్రభావం చూపుతోంది. దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూర్‌, తిరునల్వేలి, రామనాథపురం, సేలం, కన్యాకుమారి, తూత్తూకుడి భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై భారీగా నీరు చేరింది.  మహా తుపాను గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో జలపాతాలను మూసివేశారు. నీలగిరి జిల్లాలో కొండచరియలు విరిపడ్డాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తమిళనాడు ప్రభుత్వం తరలించింది.

కర్ణాటక తీర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. జనజీవనంపై పెను ప్రభావం చూపిస్తోంది. కేరళ – కర్ణాటక తీరం వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతారణ అధికారులు సూచించారు. మహా తుపాన్ నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సహాయక చర్యలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నార. నేవీ సిబ్బంది బోట్ల సహాయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 
Read More : నన్ను సీఎంను చేయండి : గవర్నర్‌కు లేఖ రాసిన రైతు