మహారాష్ట్రలో మళ్లీ కరోనా.. కోవిడ్ నిబంధనలు పాటించండి.. లేదంటే లాక్‌డౌన్ తప్పదు : సీఎం

మహారాష్ట్రలో మళ్లీ కరోనా.. కోవిడ్ నిబంధనలు పాటించండి.. లేదంటే లాక్‌డౌన్ తప్పదు : సీఎం

Covid norms to avoid lockdown : మహారాష్ట్రలో కరోనావైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే అమరావతిలో లాక్ డౌన్ విధించింది. పెద్దఎత్తున జనం గుమికూడకుండా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. జనం సంచారంపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. కోవిడ్ నిబంధలను పాటించడంలో విఫలమైతే మరో లాక్ డౌన్ విధించక తప్పదని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సైతం రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.

టెలివిజన్ వేదికగా సీఎం థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కేసుల తీవ్రత పెరుగుతోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందిగా సూచించారు. అన్ని మత, సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధించినట్టు ఆయన పేర్కొన్నారు. కరోనా కేసుల పెరుగుదల రోజురోజుకీ తీవ్రంగా ఉందని, గత 15 రోజుల్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 2వేల 500 నుంచి 7వేల వరకు పెరిగిందని థాక్రే వెల్లడించారు.

కరోనా వైరస్ సెకండ్ వేవ్ అని తెలియడానికి మరో 8 రోజుల నుంచి 15 రోజుల సమయం పట్టొచ్చునని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2వేల నుంచి 2వేల 500 మధ్య ఉండేదని తెలిపారు. కరోనా నిబంధనలను ఎవరూ ఉల్లంఘించరాదని సూచించారు. మరో వారం నుంచి 15 రోజుల వరకు కోవిడ్ నిబంధనలను పాటిస్తే.. లాక్ డౌన్ విధించాల్సిన అవసరం ఉందా లేదో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు.

అప్పటివరకూ ప్రతిఒక్కరూ విధిగా ముఖానికి మాస్క్ లు, సామాజిక దూరాన్ని పాటిస్తూ లాక్ డౌన్ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి అధికారిక చర్యలు చేపట్టామని సీఎం థాక్రే తెలిపారు.