నిబంధనలు పట్టించుకోని మహారాష్ట్ర ఎమ్మెల్యే…బర్త్ డే వేడుకలు

  • Published By: madhu ,Published On : April 6, 2020 / 04:10 AM IST
నిబంధనలు పట్టించుకోని మహారాష్ట్ర ఎమ్మెల్యే…బర్త్ డే వేడుకలు

లాక్ డౌన్ అయితే ఏంటీ ? సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది బర్త్ డే..ఏం వేడుకలు చేసుకోవద్దా ? పేదలకు సహాయం చేయవద్దా ? అనుకున్నారో ఏమో..మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే. దేశం యావత్తు లాక్ డౌన్ లో కొనసాగుతుండగానే ఆయన వందల మంది పేదలకు నిత్యావసర సరుకులు అందచేయడం చర్చనీయాంశమైంది. మంచి కార్యక్రమమే అయినా..ఈ సమయంలో..అదీ..వందలాది మంది గుమికూడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

మహారాష్ట్రలో వైరస్ ఎలా విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యధిక కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. వార్దా జిల్లా అర్వి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే దాదారావు పుట్టిన రోజు 2020, ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం. ఈయన ఏటా పుట్టిన రోజు సందర్భంగా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతరత్రా సరుకులు అందచేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేద్దామని డిసైడ్ అయ్యారు.(వదల.. బొమ్మాళీ వదల : బ్రిటన్ ప్రధాన మంత్రికి కరోనా)

వందలాది మంది గుమికూడడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

దీనిపై సదరు ఎమ్మెల్యే స్పందించారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తన బర్త్ డే సందర్భంగా కొంతమందికి మాత్రమే నిత్యావసరుకులు మాత్రమే అందచేస్తానని, విపక్షాలే ఇంతమందిని రప్పించారని ఆయన ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లఘించడంపై సబ్ డివిజనల్ ఆఫీసర్ దర్యాప్తు జరుపుతున్నారు.