మహా రాజకీయం మారుతోందా : గవర్నర్ ని విడివిడిగా కలవనున్న బీజేపీ-శివసేన

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2019 / 04:52 AM IST
మహా రాజకీయం మారుతోందా : గవర్నర్ ని విడివిడిగా కలవనున్న బీజేపీ-శివసేన

మహారాష్ట్రలో రాజకీయం వేగంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీ-శివసేన మధ్య అధికార మార్పిడి చిచ్చు రాజేసినట్లు కన్పిస్తోంది. అధికారంలో 50:50 పార్ములాకు శివసేన చేస్తున్న డిమాండ్ కు బీజేపీ అంగీకరించట్లు కన్పించడం లేదు.

ఇవాళ(అక్టోబర్-28,2019)శివసేన,బీజేపీ విడివిడిగా గవర్నర్ ను కలవనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీని ఉదయం 10:30గంటలకు శివసేన తరపున ఆ పార్టీ నాయకుడు దివాకర్ రౌత్ కలవనుండగా,11గంటలకు బీజేపీ తరపున సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలవనున్నారు. బీజేపీ-శివసేన చెరో రెండున్నర సంవత్సరాలు సీఎం సీటును పంచుకోవాలని కొత్తగా ఎన్నికైన శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సీఎం 2.5ఏళ్లు సీఎంగా ఉండేందుకు బీజేపీ అంగీకరించాలని వారు డిమాండ్ చేస్తున్న సమయంలో గవర్నర్ తో ఇవాళ ఆ రెండు పార్టీలు విడివిడిగా సమావేశమవుతుండటం మహా రాజకీయాల్లో హీట్ పుట్టిస్తోంది. మరోవైపు ఇరు పార్టీలు ఇప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచిన ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో ఉన్నాయి.

ఈ నెల 21న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ105 స్థానాల్లో విజయం సాధించగా,శివసేన 56స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు 145 ఎమ్మెల్యేల మద్దుతు అవసరం ఉంది. 2014తో పోలిస్తే ఈ సారి బీజేపీ,శివసేన కూటమికి సీట్లు తగ్గిపోయాయి. 2014లో బీజేపీ 122స్థానాలను గెల్చుకోగా,శివసేన 63స్థానాలను గెల్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. 

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-కాంగ్రెస్ లు ఈ సారి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లను గెల్చకున్నాయి. ఒకవేళ శివసేన బీజేపీ కూటమి నుంచి బయటకు వస్తే శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ,కాంగ్రెస్ శివసేనకు మద్దతు ఇచ్చే అవకాశముందని మహారాష్ట్రలో వార్తలు వినిపిస్తున్నాయి.