ముంబై-ఢిల్లీ మధ్య విమాన,రైళ్ల రాకపోకలు బంద్!

  • Published By: venkaiahnaidu ,Published On : November 20, 2020 / 09:47 PM IST
ముంబై-ఢిల్లీ మధ్య విమాన,రైళ్ల రాకపోకలు బంద్!

Maharashtra mulls freeze on flights, trains from Delhi దేశ రాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చే విమానాలను నిలిపివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

అదేవిధంగా,ఈ రెండు ప్రధాన నగరాల మధ్య నడిచే రైళ్ల సేవలను కూడా నిలిపివేయాలని చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అంతిమ నిర్ణయం ఇంకా తీసుకోలేదని మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు.



కాగా, అక్టోబర్ 28 నుంచి ఢిల్లీలో కరోనా కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించింది. నవంబర్‌ 11న 8వేల మార్కును దాటి ఆందోళనకు గురిచేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో 7,546 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిబంధనలకు ఉపక్రమించింది.

వివాహ వేడుకల వంటి శుభకార్యాలకు 50 మందిని మాత్రమే అనుమతించడం, మాస్క్‌ ధరించని వారికి రూ.2,000 జరిమానా విధించడం వంటి చర్యలకు కేజ్రీవాల్ సర్కార్ పూనుకుంది. ఢిల్లీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5లక్షల 18వేలు దాటింది. 8వేల మందికిపైగా కరోనాతో కన్నుమూశారు. 4లక్షల 65వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు.



మరోవైపు, కరోనా కేసులు అధిక సంఖ్యలో వెలుగుచూస్తోన్న రాష్ట్రాలకు కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపే యోచనలో ఉన్నట్లు శుక్రవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వెలుగులోకి రాని కేసులను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.