Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?

మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకాలం ధృతరాష్ట్రుడిలా చూస్తుండిపోయిన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతున్నా ఏమి చేయలేకపోతున్నారు.

Maharashtra political crisis: క్లైమాక్స్‌కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనానికి కారణం స్వయంకృతాపరాధమేనా?

Maharashtra Political Crisis

Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్‌కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకాలం ధృతరాష్ట్రుడిలా చూస్తుండిపోయిన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతున్నా ఏమి చేయలేకపోతున్నారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కొడుకులు ధర్మ విరుద్ధంగా వెళుతుంటే కన్నప్రేమతో చూస్తు ఊరుకున్నాడు. ఇక్కడే ఉద్ధవ్ కూడా సంకీర్ణ ధర్మానికి తలొగ్గి కూటమిలోని పార్టీలు చేసే తప్పులను వెనకేసుకొచ్చారు. అందుకే ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనించడం తప్ప ఏమి చేయలేకపోతున్నాడు. ఇంతకీ ఉద్ధవ్ చేసిన తప్పులేంటి?

ఉద్ధవ్ ఠాక్రే… మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు పాపులరైనా… ఆయన పార్టీలో అడుగు పెట్టిన సమయంలో రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు. కేవలం బాల్‌ఠాక్రే తనయుడిగానే జనానికి తెలుసు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ప్రచార ఇంచార్జ్‌గా రాజకీయం మొదలు పెట్టారు. బాల్ ఠాక్రేకు అగ్రెసివ్ లీడర్‌గా పేరుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే అందుకు చాలా భిన్నం. సైలెంట్‌గా తనపని తాను చేసుకునిపోయేవారు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్న ఉద్ధవ్ ఠాక్రే అందులోనే డిగ్రీ చేశారు. అప్పటి వరకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండే వారు. కానీ బృహన్ ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలకంగా వ్యవహారించాడని ఉద్ధవ్ ఠాక్రేను 2003 పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు బాల్ ఠాక్రే. ఆసమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే పార్టీకి చెందిన దినపత్రిక సామ్నాకు ఎడిటర్‌గా పనిచేశారు.

Also read :  Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..

బాల్ ఠాక్రే తనయుడిగా ఉద్ధవ్ ఠాక్రే జనానికి తెలిసినా… రాజకీయాల్లో మాత్రం బాల్ ఠాక్రేకు అన్న కొడుకు రాజ్ ఠాక్రే కుడి భుజంలా ఉండే వాడు. బాల్‌ఠాక్రే తరహాలోనే రాజ్‌ఠాక్రే కూడా అగ్రెసివ్ లీడర్. రాజ్ ఠాక్రేనే శివసేన పార్టీలో బాల్‌ఠాక్రేకి వారసుడు అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఉద్ధవ్‌ ఠాక్రేకు బాల్‌ఠాక్రే పదవులు అప్పగించడాన్ని నిరసిస్తూ 2006లో రాజ్‌ ఠాక్రే శివసేన నుంచి వేరుపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 2012లో బాల్‌ఠాక్రే మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాడు ఉద్దవ్ ఠాక్రే. 2013లో పార్టీని గెలిపించి శివసేనలో నెంబర్ వన్‌గా ఎదిగారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధించినా బీజేపీతో పొత్తుకు నో చెప్పి అధికారం కోసం తమకు బద్ధశత్రువులైన ఎన్సీపీ, కాంగ్రెస్‌తో జట్టు కట్టారు ఉద్ధవ్ ఠాక్రే. సంఖ్యాబలం లేకపోయినా మూడు పార్టీల కూటమితో మహావికాస్ అఘాడీ ఏర్పాటు చేసి అధికారం చేజిక్కించుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీని గద్దెనెక్కకుండా… అనైతిక పొత్తులతో అధికారం సొంతం చేసుకున్నారని బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

అధికారం దక్కిన తర్వాత సంకీర్ణ ధర్మం పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీలో అసమ్మతిని రాజేశాయి. పొత్తు పెట్టుకున్న పార్టీలకు పూర్తి స్వేచ్చ ఇచ్చి తన సొంత పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహారాష్ట్రలో హిందూత్వ నినాదాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా చాలా విషయాల్లో రాజీపడ్డారు. ముంబై అల్లర్లకు కారణమైన దావూద్ ఇబ్రహీంకు సన్నిహితుడిగా చెప్పుకునే నవాబ్ మాలిక్ కు ఏకంగా మంత్రిపదవి ఇచ్చారు. చివరకు ఆ కేసులో అరెస్ట్ అయినా కేబినెట్ నుంచి తొలగించలేదు. ఈ విషయంలో శివసేన విమర్శల పాలైంది అయినా లెక్క చేయలేదు.

Maharashtra political crisis: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఏకనాథ్ షిండే అడుగులు..పేరు కూడా ఖరారు?!

శివసైనికులు అంటే హిందూత్వాన్ని పరిరక్షించే వారనే పేరు తీసుకొచ్చారు బాల్ ఠాక్రే. ఆయన ఉన్నంత కాలం శివసేనకు అదే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌తోనే గతంలో బీజేపీతో కలిసి మహారాష్ట్రలో అధికారం కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు హిందూత్వ గురించి మాట్లాడే వాళ్లను పక్కన పెట్టేశారు ఉద్ధవ్ ఠాక్రే. సంజయ్ రౌత్ లాంటి వాళ్లను ప్రోత్సహించిన ఉద్ధవ్ ఠాక్రే తాను పార్టీ సిద్ధాంతాలకు దూరమవుతున్నాననే విషయం మరిచిపోయారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన నవనీత్ రాణే దంపతులను అరెస్టు చేసి జైల్లో పెట్టించడం ద్వారా హిందూత్వకు మద్దతిచ్చే వారి ఆగ్రహానికి గురయ్యారు. ఇదే అసమ్మతి ఎమ్మెల్యేల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. తండ్రి స్థాపించిన పార్టీలోకి ఓ సీఈఓ తరహాలో వచ్చాడే తప్ప పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు ఉద్ధవ్ ఠాక్రే.

ఇక బాల్ ఠాక్రే నిత్యం పార్టీ కార్యకర్తల మధ్య ఉండేవారు. కార్యకర్తలే పార్టీకి బలమని నమ్మినవాడు బాలా సాహేబ్. కానీ ఉద్ధవ్ వర్కింగ్ స్టైలే వేరు. ఆయన పార్టీ నేతలకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిరుగుతాడనే విమర్శలున్నాయి. అంతే కాదు పూర్తిగా బ్యూరోక్రాట్ల మీద ఆధారపడి పనిచేస్తాడనే పేరుంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కళ్లు కనిపించక పక్కనున్న వారు చెప్పేది విని నిర్ణయాలు తీసుకునే వాడు. కానీ ఉద్ధవ్ చూపు ఉండి కూడా అంధుడిగా మారిపోయాడంటూ రెబల్ ఎమ్మెల్యేలు డైరెక్ట్‌గానే విమర్శిస్తున్నారు. ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు రావడానికి ఇదే ప్రధాన కారణం, ప్రథమ కారణం అంటారు ఆ పార్టీ నేతలు. ఓ రకంగా శివసేనలో ముసలం రగలడానికి కర్త,కర్మ,క్రియ.. అన్నీ ఉద్ధవ్‌ ఠాక్రేనే అన్న వాదన బలంగా వినిపిస్తోంది.