మరో న్యూయార్క్ గా మారిన మహారాష్ట్ర

  • Published By: venkaiahnaidu ,Published On : June 14, 2020 / 11:24 AM IST
మరో న్యూయార్క్ గా మారిన మహారాష్ట్ర

కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్ర అల్లాడిపోతోంది. రాష్ట్రంలో వైరస్ కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల్లో వైరస్ మొదట వెలుగులోకి వచ్చిన చైనానే మహారాష్ట్ర దాటేసింది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.  

మార్చి 9న దుబాయ్‌ నుంచి వచ్చిన పుణే జంటకు కోవిడ్‌–19 సోకిన దగ్గర నుంచి  96 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్ష కేసులు దాటేశాయి. 50 వేలు కేసులు నమోదు కావడానికి 77 రోజుల సమయం తీసుకుంటే మరో 50 వేల కేసులు కేవలం 19 రోజుల్లో దాటాయంటే వైరస్‌ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర కనుక ఒక దేశమే అయి ఉంటే, వరల్డో మీటర్‌ ప్రకారం ప్రపంచంలో అత్యధిక కేసుల్లో 17వ స్థానంలో ఉన్నట్టు లెక్క.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,01,141 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా కేసులు వాణిజ్య రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. నగరంలో మొత్తంగా 55,451 కేసులు నమోదు కావడం కలవరపెట్టే అంశం. ముంబై తర్వాత థానేలో 16,443 కేసులు, పుణేలో 11,281 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 3,717 మంది ప్రాణాలు కోల్పోతే ముంబైలో మృతుల సంఖ్య 2,044గా ఉంది.

రికవరీ రేటు పెరిగింది  

అయితే వైరస్‌ను నియంత్రించడానికి తొలిదశలో లాక్‌డౌన్‌ సాయపడిందన్నారు. అమెరికా, యూరప్‌ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందని  ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ తోపే అంటున్నారు. అమెరికా, యూరప్‌ దేశాలతో పోల్చి చూస్తే మహారాష్ట్ర పరిస్థితి అంత ఘోరంగా లేదని రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 47.34% ఉంటే, మరణాల రేటు 3.7%గా ఉందన్నారు

బెడ్స్ కొరత 
బెడ్స్‌ లేక ఒకే మంచంపై ఇద్దరు రోగుల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. న్యూయార్క్‌ కంటే ప్రమాదకరమైన స్థితిలోకి ముంబై వెళ్లిపోతోంది. వెంటిలేటర్‌ కావాలంటే 2 గంటలు కంటే ఎక్కువ సేపు వేచి చూడాల్సి వస్తోందని స్వయంగా ఆస్పత్రి డాక్టర్ లే చెబుతున్నారు. ఐసీయూ (ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌) విషయానికొస్తే ముంబైలో 99 శాతం మేర నిండిపోయాయి.

నగరంలో 94 శాతం వెంటిలేటర్లు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. జూన్‌ 11 నాటికి ముంబై నగరంలో ఐసీయూలో మొత్తం 1.181 పడకలు ఉంటే వాటిలో 1, 167 పడకలు ఇప్పటికే ఆక్రమించాయి. కేవలం 14 పడకలు మాత్రమే కొత్తగా చేరే పేషెంట్ల కోసం మిగిలి ఉన్నాయి. అలాగే 530 వెంటిలేటర్లలలో 497 ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే కరోనా పేషెంట్ల కోసం బెడ్లను పెంచడం ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు సవాల్‌గా మారింది.

ఎందుకిన్ని కేసులు ?
 మహారాష్ట్రలో ప్రతీ చదరపు కిలోమీటర్‌కి 370 మంది నివసిస్తారు. ముంబై నగరంలో 42 శాతం జనాభా మురికివాడల్లోనే ఉంటారు. వీరే కరోనా వ్యాప్తికి క్యారియర్స్‌గా మారారు. 

లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు విధుల్లోకి వచ్చారు. దుకాణాలన్నీ తెరవడంతో జనం రోడ్లపై భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు.

లాక్‌డౌన్‌ సమయాన్ని ఆరోగ్య రంగంలో సదుపాయాలు పెంచుకోవడానికి వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.