ఏటీఎం సెంటర్లో సీన్ చూసి షాక్, యువతి ధైర్యానికి ప్రశంసలు

ఏటీఎం సెంటర్లో సీన్ చూసి షాక్, యువతి ధైర్యానికి ప్రశంసలు

Atm

Maharashtra Woman : మన ఎదుట దారుణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. మరికొందరు మాత్రం ధైర్యంగా నేరాలను ఆపేందుకు ముందుకొస్తుంటారు. ఈ విషయంలో తామేమీ తక్కువేం కాదంటూ..మహిళలు నిరూపిస్తున్నారు. ఉదయం 3 గంటల వేళ ఏటీఎం సెంటర్ లో జరిగే నేరాన్ని ఆపింది ఓ యువతి. ఆ యువతి చూపెట్టిన ధైర్య సాహసాలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇంతకీ ఆ యువతి ఏం చేసింది ?
మహారాష్ట్రలోని ఫల్ఘర్ జిల్లాలో వాసయ్ నగరంలోని వాలివ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున 26 ఏళ్ల యువతి నడుచుకుంటూ వస్తోంది. కొద్దిదూరంలో ఉన్న ఏటీఎం లో షాకింగ్ సీన్ కనిపించింది. ఓ వ్యక్తి ఏటీఎంలో ఉన్న డబ్బులను దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్ధారించుకుంది. తనకేం సంబంధం అంటూ ఆ యువతి అక్కడి నుంచి వెళ్లిపోలేదు. అతనికి కనపడకుండా..చాటుగా ఏటీఎం వద్దకు వెళ్లింది. దానికి ఉన్న షట్టర్ ను అమాంతం మూసివేసింది. బయటకు వచ్చేందుకు ఆ దొంగ ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. అంతలో ఆ యువతి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. అక్కడకు వచ్చిన పోలీసులు ఆ దొంగను అరెస్టు చేశారు. అంత రాత్రి వేళ ఆ యువతి చూపెట్టిన తెగువకు పోలీసులతో పాటు స్థానికులు ప్రశంసలు కురిపించారు. దొంగ బయటకు పారిపోనీయకుండా చేయడం పట్ల పొగడ్తలు వర్షం కురిపిస్తున్నారు.