Maha 5-Level Unlock Plan: మహారాష్ట్ర 5-లెవల్ అన్‌లాక్ ప్లాన్: పూర్తిగా తెరుచుకోనున్న 18 జిల్లాలు..

కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్‌లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది.

Maha 5-Level Unlock Plan: మహారాష్ట్ర 5-లెవల్ అన్‌లాక్ ప్లాన్: పూర్తిగా తెరుచుకోనున్న 18 జిల్లాలు..

Maha 5 Level Unlock Plan

Maha 5-level Unlock Plan : కొవిడ్ -19తో తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో 5-లెవల్ అన్‌లాక్ వ్యూహాన్ని ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ బెడ్ ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గింది. దాంతో రాష్ట్రంలోని మొత్తం 36 జిల్లాల్లోని 18 జిల్లాల్లో కొవిడ్ ఆంక్షలను గురువారం (జూన్ 4) నుంచి ఎత్తివేస్తామని ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అగాది ప్రభుత్వం వెల్లడించింది. లెవల్-1గా వర్గీకరించిన 18 జిల్లాల్లో అన్ని ఆంక్షలు ఎత్తివేయనుంది.

ఈ 18 జిల్లాల్లో ఔరంగాబాద్, భండారా, బుల్ధానా, చంద్రపూర్, ధూలే, గాడ్చిరోలి, గోండియా, జల్గావ్, జల్నా, లాటూర్, నాగ్పూర్, నాందేడ్, నాసిక్, యావత్మల్, వాషిమ్, వార్ధా, పర్భాని, థానే ఉన్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో లెవల్-2లో ఉంది. ముంబై నగరంలో ఆంక్షలు పాక్షికంగా సడలించనుంది. కానీ, స్థానిక రైళ్ల సర్వీసులు మాత్రం నిలిచిపోయాయి. ప్రస్తుతానికి సాధారణ ప్రజలకు స్థానిక రైల్వే సర్వీసులు అందుబాటులో ఉండవు.

ఆయా జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల స్థితి ఆధారంగా రాష్ట్రానికి 5-లెవల్ అన్‌లాక్ ప్రణాళికను సిద్ధం చేసినట్టు మహా ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యల్ప పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలకు ఎలాంటి పరిమితులు ఉండవని మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ అన్నారు. ముంబైలో జరిగిన రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సమావేశం తరువాత వాడేటివార్ ఈ ప్రకటన చేశారు.

మహారాష్ట్రలో బుధవారం 15,169 కొత్త కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 57,76,184కు చేరింది. అలాగే 285 కొత్తగా మరణాలు నమోదు కాగా.. గతంలో నివేదించని 268 మరణాలను ఇందులో చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 96,751కు పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసులు మంగళవారం నమోదైన 14,123 ఇన్‌ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 29,270 కొవిడ్ -19 బాధితులు ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కోలుకున్న వారి సంఖ్య 54,60,589కు చేరుకుందని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పుడు 2,16,016 యాక్టివ్ కొవిడ్ -19 కేసులు ఉన్నాయి. కరోనావైరస్ రికవరీ రేటు రోజు క్రితం 94.28శాతం నుంచి 94.54 శాతానికి స్వల్పంగా పెరిగింది. ఇక మరణాల రేటు 1.67శాతం వద్ద ఉంది. మహారాష్ట్రలో కరోనావైరస్ 2,36,491 మందికి టెస్టులు నిర్వహించగా.. ఇప్పటివరకు పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 3,55,14,594గా ఉందని ఒక ప్రకటనలో తెలిపింది.