బడ్జెట్ కవర్ పై గాంధీ హత్య ఫొటో….కేంద్రంపై కేరళ డైరక్ట్ ఎటాక్

  • Published By: venkaiahnaidu ,Published On : February 7, 2020 / 05:35 PM IST
బడ్జెట్ కవర్ పై గాంధీ హత్య ఫొటో….కేంద్రంపై కేరళ డైరక్ట్ ఎటాక్

కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ 2020-21 బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. బడ్జెట్‌ కవర్ పేజీపై మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన చిత్రాన్ని ముద్రించారు. దీంతో ఈ బడ్జెట్ తీవ్ర రాజకీయ దుమారం రేపింది.

అయితే  ఇది పూర్తిగా రాజకీయపరమైన ప్రకటనేనని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి చెప్పారు. మహాత్మా గాంధీ హత్య దృశ్యాన్ని ఓ మళయాళ ఆర్టిస్ట్ చిత్రించారని, దానిని కవర్ పేజీపై ముద్రించామని చెప్పారు. మలయాళం ఆర్టిస్టు వేసిన ఈ చిత్రంలో బుల్లెట్‌ గాయాల కారణంగా బాపు రక్తపు మడుగులో పడిఉన్నారు. మద్దతుదారులు ఆయన చుట్టూ చేరి రోదిస్తున్నారు. ఆర్థికశాఖ మంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ….మహాత్మా గాంధీని ఎవరు బలితీసుకున్నారనేది తాము మరిచిపోలేదని చాటేందుకు ఇది తాము పంపిన సంకేతమని స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ హిందూ మతవాదుల చేతుల్లో హత్య చేయబడ్డారని,అలాంటి హిందూ మతవాదులను ఇవాళ బీజేపీ,కేంద్రప్రభుత్వం చేత గౌరవించబడుతున్నారన్నారు. చరిత్రను తిరగరాస్తున్నారని, జాతీయ పౌరుల పట్టిక (ఎన్ఆర్‌సీ)ని దేశాన్ని మతపరంగా విభజించేందుకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. చరిత్రను తిరగరాస్తున్న సమయంలో ఇటువంటివి చాలా ముఖ్యమని చెప్పారు.

కొన్ని ప్రసిద్ధ గుర్తులను చెరిపేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కేరళ సమైక్యంగా నిలుస్తుందన్నారు. ప్రజలు మరచిపోని సంఘటనను సీపీఐ(ఎం)-ఎల్‌డీఎఫ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మరొకసారి దేశ ప్రజలకు సందేశం పంపదలచిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేరళకు నిధులను మంజూరు చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు.

మోడీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను కేరళ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సీఏఏ రాజ్యాంగ విరుద్ధమంటూ,కేంద్రం ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం కూడా పాస్ చేసింది. కేరళ సీఏఏ వ్యతిరేక తీర్మాణం చేసిన అనంతరం మరికొన్ని రాష్ట్రాలు కూడా కేరళ తరహాలో సీఏఏ వ్యతిరేక తీర్మాణాలు పాస్ చేశాయి.