Khela Hobe : ఫుట్ బాల్ ఆడిన మమతాబెనర్జీ

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Khela Hobe : ఫుట్ బాల్ ఆడిన మమతాబెనర్జీ

Mamata

Khela Hobe వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో “ఖేలా హోబ్” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం మమతా..వేదిక‌పై కొద్దిసేపు కాసేపు ఫుట్‌బాల్‌తో ఆడుకున్నారు. ఆ త‌ర్వాత ఒక్కో బంతిని కార్య‌క్ర‌మానికి హాజ‌రైన జ‌నంలోకి విసిరేశారు.

అనంత‌రం స‌మావేశంలో ప్ర‌సంగించిన మమతా..మీరు న‌మ్మండి, న‌మ్మ‌క‌పోండి.. ఖేలా హోబ్ నినాదం చాలా పాపుల‌ర్ అయింది. ఇటీవ‌ల ఈ నినాదం పార్ల‌మెంటులో కూడా మార్మోగింది. త్వ‌ర‌లోనే ఈ నినాదం దేశ‌మంతా వ్యాప్తి చెందుతుందన్నారు.

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో “ఖేలా హోబ్” పదం బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఖేలా హోబ్ అంటే… ఆట మొదలైంది అని అర్థం. కొన్నేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన బ్లంగాదేశీ ఆవామీ లీగ్ ఎంపీ షమీమ్ ఒస్మాన్ తొలిసారిగా ఈ ‘ఖేలా హోబ్’ నినాదాన్ని అక్కడ వినిపించారు.

బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ కూడా ‘ఖేలా హోబ్’ అంటూ బీజేపీకి సవాల్ విసిరారు. మొదట్లో ఈ స్లోగన్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. బంగ్లాదేశ్ నుంచి అరువు తెచ్చుకున్న నినాదంతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని టీఎంసీని విమర్శించింది. కానీ ఆ తర్వాత కొద్దిరోజులకే సీన్ మారిపోయింది. బీజేపీ సహా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇదే నినాదాన్ని అందుకున్నాయి. అయితే తృణ‌మూల్ నేత దేవాన్షు భ‌ట్టాచార్జి రాసిన ఖేలా హోబ్ గేయం..ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌చారంలో మార్మోగింది. ఒక ర‌కంగా బెంగాల్‌లో టీఎంసీ విజ‌యం సాధించ‌డానికి ఇది కూడా కార‌ణ‌మైంది.