మోడీకి కౌంటర్ గా మమత పాదయాత్ర..బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీ ఓటేయాలని పిలుపు

మోడీకి కౌంటర్ గా మమత పాదయాత్ర..బీజేపీ దగ్గర డబ్బులు తీసుకొని టీఎంసీ ఓటేయాలని పిలుపు

mamata ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల ప్ర‌చారం హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ ఆదివారం రాష్ట్రానికి విచ్చేసి కోల్ కతాలో ర్యాలీలో పాల్గొనడంతో ప్ర‌చారానికి ఓ ఊపు రాగా..మోడీకి కౌంటర్ గా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ సిలిగురిలో పాదయాత్ర చేపట్టారు.

ఎల్​పీజీ ధరల పెంపునకు వ్యతిరేకంగా డార్జిలింగ్‌ మోర్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు వేలాదిమంది కార్యకర్తల నడుమ మమత పాదయాత్ర చేశారు మమతా బెనర్జీ. మమతతో పాటు ఎల్‌పీజీ సిలిండర్‌ను పోలిన ఎర్రటి ప్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యాత్రలో దీదీతో పాటు తృణమూల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య, ఎంపీలు మిమి చక్రవర్తి, నుస్రత్ జహాన్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సానికి ఒకరోజు ముందు జరిగిన ఈ పాదయాత్రలో మహిళలు భారీ ఎత్తున పాల్గొని తమకు సంఘీభావం తెలిపారని భట్టాచార్య అన్నారు.

పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో మోడీ సర్కార్‌పై మమత మండిపడ్డారు. ఇంకొద్ది రోజుల్లో ఎల్‌పీజీని సామాన్యులకు దూరం చేస్తారని..మ‌న గ‌ళాల‌ను వినిపించాలంటే భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు త‌ప్ప‌వ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల ముందు ఉజ్వ‌ల, ఎన్నిక‌ల త‌ర్వాత జుమ్లా అని ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా కౌంట‌ర్ వేశారు. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా పెరిగిపోతున్నాయ‌ని, అందుకే తాను స్కూట‌ర్‌పై ఆఫీసుకు వెళ్లాన‌ని ఈ సంద‌ర్భంగా మ‌మ‌తా చెప్పారు. మోడీ దేశాన్ని అమ్ముతున్నారు.. ఈ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు, మ‌హిళ‌ల‌కు, రైతుల‌కు, యువ‌త‌కు అంద‌రికీ వ్య‌తిరేక‌మే.. ఈ ప్ర‌భుత్వం వెళ్లిపోవాల్సిందే అని ఆమె అన్నారు.

ప్ర‌ధాని ప్ర‌తి రోజూ అబద్ధాలే మాట్లాడుతున్నార‌ని మమత విమ‌ర్శించారు. బెంగాల్ ప్రజలను మమత వెన్నుపోటు పొడుస్తుందని ఇవాళ కోల్ కతా ర్యాలీలో మోడీ చేసిన వ్యాఖ్యాలపై మండిపడ్డ మమత..దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ప్రధానికి సవాల్ విసిరారు. టైమ్,డైట్ ప్రధాని నిర్ఱయించవచ్చునని ఆమె తెలిపారు. బారత్ నుంచి మోడీని,బీజేపీని వెళ్లగొడతామని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఆయిల్ ధరలు పెంచుతూ,బ్యాంకులను అమ్మేస్తూ ప్రధాని..బెంగాల్ లో కలలను అమ్మేందుకు వచ్చారని మమత విమర్శించారు.

మోడీ ప్రసంగాలపై విమర్శలు గుప్పించారు మమత. మోడీ ఎప్పుడూ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతారని అన్నారు. బెంగాల్ ​లో మహిళలకు భద్రత లేదన్న ప్రధాని వ్యాఖ్యలను మమత ఖండించారు. యూపీ, బీహార్​ల కంటే బెంగాల్​లో మహిళలు సురక్షితంగానే ఉన్నారన్నారు. ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ ఓటుకు నోటు రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ నాయకుల దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని టీఎంసీకి ఓటు వేయాలని ప్రజలకు మమత సూచించారు.