జగన్,కేసీఆర్ సహా 15 బీజేపీయేతర పార్టీల అధినేతలకు మమత లేఖ

భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు.

జగన్,కేసీఆర్ సహా 15 బీజేపీయేతర పార్టీల అధినేతలకు మమత లేఖ

Mamata Banerjee2

Mamata Banerjee భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే అధినేత స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్,తెలంగాణ సీఎం కేసీఆర్,ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్,జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కే.ఎస్.రెడ్డి, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, దీపాంకర్ భట్టాకు వ్యక్తిగతంగా మమత లేఖ రాశారు.

బీజేపీ తీరుతో ఇతర పార్టీల పాలనలోని రాష్ట్రాలు ఏ విధంగా నష్టపోతున్నాయో ఆ లేఖలో మమత వివరించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ చేస్తోన్న దాడులను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు ఓ విశ్వ‌స‌నీయ ప్ర‌త్యామ్నాయాన్ని ఇవ్వాల్సిన అవ‌సరం ఉన్న‌ద‌ని ఆమె నొక్కి చెప్పారు.

ఢిల్లీపై కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలపడం ‘అత్యంత ఘోరమైన’ చర్య అని మమత తన లేఖలో వివరించారు. ఈ చట్టంతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కొల్లగొట్టి, లెఫ్టినెంట్ గవర్నర్ చేతికి అప్పగించారని ఆరోపించారు.’భారతదేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ ఆధారిత సమాఖ్యవాదంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జరిపిన వరుస దాడులపై నాకున్న తీవ్రమైన ఆందోళనను తెలియజేసేందుకే బీజేపీయేతర పార్టీల నాయకులైన మీకు ఈ లేఖ రాస్తున్నాను అని మమత ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారాల‌కు క‌త్తెర వేసి వాటిని మున్సిపాలిటీల స్థాయికి తీసుకెళ్ల‌డానికి బీజేపీ చూస్తోంద‌ని మమత అన్నారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే దేశంలో ఏక పార్టీ అధికార‌మే బీజేపీ ల‌క్ష్య‌మ‌ని మ‌మత లేఖలో స్ప‌ష్టం చేశారు. తృణ‌మూల్ చీఫ్‌గా మీ అంద‌రితో క‌లిసి ప‌ని చేయ‌డానికి నేను సిద్ధంగా ఉన్నాను… మ‌నం చేతులు క‌లిపే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని మ‌మ‌త లేఖ‌లో చెప్పారు.