సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తోన్న రైతులతో మాట్లాడిన మమత

సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తోన్న రైతులతో మాట్లాడిన మమత

Mamata speaks to farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద ఉద్యమిస్తున్న రైతులతో టీఎంసీ అధినేత్రి,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంగళవారం ఫోన్​లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఇవాళ(డిసెంబర్-23,2020) ‘రైతు దినోత్సవం’​ సందర్భంగా మమత సూచనల మేరకు.. టీఎంసీకి చెందిన ఐదుగురు ఎంపీలు సింఘు సరిహద్దుకు చేరుకుని తమ సంఘీభావం తెలిపారు.

డీరక్​ ఓబ్రెయిన్​, శతాబ్ది రాయ్​, ప్రసూన్​ బెనర్జీ, ప్రతిమా మండల్​, ఎండీ నదిముల్​ హాక్​లతో కూడిన​ ఎంపీల బృందం రైతుల నిరాహార దీక్షలో పాల్గొంది. ఈ సందర్భంగా రైతులతో మమత ఫోన్ లో మాట్లాడారు. ఆందోళనకు తమ మద్దతు ఉంటుందని ఆమె రైతులకు హామీ ఇచ్చారు. అయితే రైతులతో మమతా బెనర్జీ ఫోన్​లో మాట్లాడటం ఈ నెలలో ఇది రెండోసారి.

కాగా, మమతతో ఫోన్​లో మాట్లాడిన రైతు సంఘాల ప్రతినిధులు ఆమెను తమ ధర్నా ప్రదేశాన్ని సందర్శించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో దేశానికి అన్నం పెట్టే రైతులు ఆకలితో అలమటించడం దురదృష్టకరం అని మమత పేర్కొన్నారు.

నూతన అగ్రి చట్టాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ.. ఢిల్లీ సరిహద్దులో రైతులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా.. డిసెంబర్​ 23న పౌరులందరూ ఒక పూట భోజనం మానేయాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. డిసెంబర్​ 25 నుంచి 27 మధ్య ఢిల్లీ-హర్యాణా హైవేపై టోల్​ రుసుం చెల్లించకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు.