Corona Vaccine : కరోనా వ్యాక్సిన్.. భయంతో చెట్టెక్కిన వ్యక్తి

కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడి చెట్టెక్కాడు ఓ వ్యక్తి.. గ్రామంలో కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చారు. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భయంతో వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉన్న చెట్టు ఎక్కాడు

Corona Vaccine : కరోనా వ్యాక్సిన్.. భయంతో చెట్టెక్కిన వ్యక్తి

Corona Vaccine

Corona Vaccine : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ప్రతి రోజు 50 లక్షలమందికి పైనే వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ ఇస్తున్నారు అధికారులు. అయితే వ్యాక్సినేషన్ ప్రారంభించి ఆరు నెలలు అవుతున్న కొందరిలో మాత్రం అపోహలు పోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేస్తున్న సమయంలో కొందరు భయపడిపోతున్నారు.

కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందు రావడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. రాజ్‌గర్హ్ జిల్లా పతంకలన్ గ్రామంలో తాజాగా వ్యాక్సినేషన్ శిబిరం నివహించారు. గ్రామానికి చెందిన చాలామంది ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకునేందుకు వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన కన్వర్లాల్ అనే వ్యక్తి వ్యాక్సినేషన్ సెంటర్ కి వచ్చి లైన్ లో నిల్చున్నాడు.

అందరు వ్యాక్సిన్ తీసుకుంటుంటే అక్కడే ఉండి చూశాడు. తన వంతురాగానే పరుగున వెళ్లి పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. అతడు వెళ్తే వెళ్ళాడు తన భార్య ఆధార్ కార్డును కూడా తీసుకోని వెళ్ళాడు. గ్రామస్తులు ఎంత బ్రతిమాలినా కిందకు దిగలేదు. ఎవరైనా చెట్టెక్కడానికి ప్రయత్నిస్తే కిందకు దూకుతానంటూ బెదిరించాడు. ఆలా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తయ్యేవరకు కన్వర్లాల్ చెట్టుపైనే కూర్చున్నాడు.

వైద్య సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చెట్టు దిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇదే అంశంపై ఖుజ్నర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ మీడియా ప్రతినిధులు సంప్రదించారు. ఆయన జరిగిన విషయం తెలుసుకొని గ్రామానికి వెళ్లి కన్వర్లాల్ కు టీకాపై ఉన్న అపోహలు తొలగించినట్లు తెలిపారు. మరోసారి గ్రామంలో క్యాంప్ పెట్టినప్పుడు కన్వర్లాల్, అతడి భార్యకు కరోనా టీకా ఇస్తామని తెలిపారు.