సొంతూరికి వెళ్లేందుకు శవంగా మారి.. ఆంబులెన్స్‌లో వెళ్తూ దొరికారు

  • Published By: vamsi ,Published On : April 3, 2020 / 11:51 AM IST
సొంతూరికి వెళ్లేందుకు శవంగా మారి.. ఆంబులెన్స్‌లో వెళ్తూ దొరికారు

సినిమా స్క్రిప్ట్‌కి ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో సీన్ల మాదిరిగానే ఓ 60 ఏళ్ల వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో దేశ ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి సొంత ఊళ్లకు పయనం అవుతున్నారు. అయితే రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించింది. అనేకమంది వందల కిలోమీటర్లు కాలినడకన తమ సొంతూళ్లకు చేరుకుంటూ ఉన్నారు.

మరి కొంతమంది మాత్రం పోలీసుల కళ్లుగప్పి వాహనాలలో వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, పోలీసులు మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సొంతూరికి వెళ్లడానికి శవంలా మారాడు. సొంతూరు వెళ్లేందుకు శవంగా మారి ఆంబులెన్స్ బుక్ చేసుకుని.. జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లడానికి ముగ్గురు వ్యక్తులు.. ఒక వ్యక్తి చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ తీసుకున్నారు.

ముగ్గురు వ్యక్తులు అంబులెన్స్ సాయంతో తమ గ్రామానికి వెళ్లేందుకు ఆంబులెన్స్ తీసుకున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ముగ్గురిలో ఓ వ్యక్తి మరణించినట్లు నటించాడు. శవాన్ని తమ గ్రామానికి తీసుకెళ్తున్నామని చెక్‌పోస్ట్ ల వద్ద పోలీసులకు చెప్పారు. అయితే సూరన్ కోట్ చెక్‌పోస్ట్‌‌కు చేరుకోగానే పోలీసులు అనుమానం వచ్చి అంబులెన్స్‌ను తనిఖీ చేశారు. అందులో శవంలా ఉన్న వ్యక్తికి టెంపరేచర్ చూడగా బతికే ఉన్నాడని పసిగట్టారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 

పూంచ్‌లోని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ రమేష్ అంగ్రాల్ మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్‌తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేసి పోలీసుల రక్షణలో ఉన్న నిర్బంధ కేంద్రానికి పంపినట్లు చెప్పారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420 (మోసం), 269 (జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేసే నిర్లక్ష్య చర్య) మరియు 188 (ప్రభుత్వ సేవలకు ఆటంకం) కింద ఐదుగురిపై కేసు నమోదు చేశారు. 

Also Read | మానవత్వానికి శత్రువులు : తబ్లిగి జమాత్ సభ్యులపై సీఎం యోగి సీరియస్