కర్ణాటకలో పరువు హత్య…గొంతుకు బెల్టు బిగించి…….

10TV Telugu News

Karnataka Honour Killing : హైదరాబాద్ లో జరిగిన పరువు హత్య మరువక ముందే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన పరువు హత్యకలకలం రేపుతోంది. కోరుకున్నవాడిని పెళ్లి చేసుకోవటమే పాపంగా పెద్దలు ఈ ఘాతకాలకు ఒడిగడుతున్నారు.

కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం యువతి, లక్ష్మీపతి అనే యువకుడు 2017 నుంచి ఒకే ఫ్యాక్టరీలో కలిసి పని చేశారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరివి వేర్వేరు మతాలు కావటంతో తల్లితండ్రులు వారి ప్రేమను అంగీకరించలేదు. పెళ్లికి అడ్డు చెప్పారు. తల్లి తండ్రులను ఒప్పించలేని ప్రేమికులు గత నెలలో పారిపోయి పెళ్ళిచేసుకున్నారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకోవటం జీర్ణించుకోలేని యువతి కుటుంబ సభ్యులు లక్ష్మిపతిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.


వీరిద్దరి ప్రేమ కారణంగా రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన గొడవలు సర్దుబాటు చేసుకుందాం రమ్మనమని తన కూతురిని….లక్ష్మీపతిని పిలిపించారు. ఇద్దరూ తిరిగి ఇంటికి రావాలని వారికి మళ్ళీ పెళ్లి చేస్తామని నమ్మించారు. తండ్రి మాట విన్న యువతి భర్తకు ఈ విషయం చెప్పింది. అంతా మంచిగానే జరుగుతుందని భావించిన నూతన దంపతులు మంగళవారం ఉదయం యువతి ఇంటికి వెళ్లారు. వారితో పాటు లక్ష్మీపతి అన్న నటరాజ్ కూడా వెళ్లాడు. అక్కడ వారందరూ కలిసి ఒక ప్రార్ధనా మందిరానికి వెళ్ళారు. అక్కడ వారితో కాసేపు చర్చించిన తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి వారికి మద్యం పార్టీ ఏర్పాటు చేశారు. వారితో ఫుల్ గా మద్యం తాగించారు. అంతటితో ఆగకుండా యువతి తండ్రి లక్ష్మీపతిని కులంపేరుతో దూషిస్తూ, తన కూతురుని పెళ్లి చేసుకోవాలని కలలో కూడా అనుకోవద్దని… తన కూతురుని మర్చిపోవాలని బెదిరించాడు.
దీనికి లక్ష్మీపతి ఒప్పుకోకపోవటంతో యువతి కుటుంబం దాడికి దిగింది. ఇంతలోనే కోపం పట్టలేక యువతి తండ్రి నిజాముద్దీన్ ..తన కొడుకు సికిందర్ సాయంతో….లక్ష్మీపతిని నటరాజ్ కళ్ల ఎదుటే బెల్టుతో గొంతు నులిమి హత్య చేశాడు. భయంతో నటరాజ్ సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్ళి తమ్ముడి హత్యపై ఫిర్యాదు చేశాడు. ఈవిషయం బయటకు చెబితే ఇతర కుటుంబ సభ్యులను చంపేస్తామని యువతి కుటుంబం బెదిరించినట్లు నటరాజ్ ఫిర్యాదులో పేర్కోన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిజాముద్దీన్, సికిందర్ లను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

10TV Telugu News