Delhi liquor Scam: మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. ఏప్రిల్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ
మనీశ్ సిసోడియాను ఇవాళ ఈడీ ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఏడు రోజుల పాటు సిసోడియాను ఈడీ విచారించింది.

Delhi liquor Scam
Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi liquor Scam) కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia)ను ఢిల్లీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీ ముగియడంతో ఇవాళ మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో సిసోడియాను ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగపాల్ ఏప్రిల్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించారు.
అప్పట్లో 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరగా, కోర్టు మాత్రం ఏడు రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సిసోడియాను ఈడీ కస్టడీలో ఏడు రోజుల పాటు విచారించింది. సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మార్చి 9న తిహార్ జైలులో ఈడీ ఆయనను అరెస్టు చేసింది.
లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో సిసోడియా నుంచి ఈడీ మరిన్ని విషయాలు రాబట్టింది. లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటివరకు పలువురు అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విచారణ జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. సిసోడియా మంచి పనులు చేస్తోంటే ఓర్వలేకే కేంద్ర ప్రభుత్వం ఆయనపై కుట్రకు పాల్పడిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.