రాహుల్ ప్రవర్తనతో…మన్మోహన్ ప్రధానిగా రాజీనామా చేయాలనుకున్నాడట

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2020 / 03:35 PM IST
రాహుల్ ప్రవర్తనతో…మన్మోహన్ ప్రధానిగా రాజీనామా చేయాలనుకున్నాడట

2013 జులైలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులపై వెంటనే అనర్హత వేటు వేయాలని,ఒకవేళ తనకు విధించిన శిక్షకు వ్యతిరేకంగా సదరు ప్రజాప్రతినిధి దానిని హైకోర్టులో అప్పీల్ చేసినప్పటికి కూడా అనర్హత వేటు తప్పదంటూ సుప్రీం తీర్పు చెప్పింది. అయితే అప్పట్లో ఆ తీర్పు పట్ల చాలా మంది ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఆ సమయంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కి ముఖ్యంగా ఆ తీర్పు చాలా ఇబ్బంది కలిగించేదిగా మారింది.2009లో లాలూ లోక్ సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. అంతేకాకుండా అప్పటి యూపీఏ-2లో ఆర్జేడీ పార్టీ ముఖ్య భాగస్వామిగా,సోనియా మద్దతుదారుగా ఉంది. లాలూ బీహార్ సిఎంగా ఉన్నకాలంలో పశుగ్రాసం కుంభకోణం సహా మరికొన్ని కేసులపై ఆయనపై అప్పటికి విచారణ జరుగుతోంది. ఈ కేసులలో నేరం రుజువైతే పార్లమెంటులో కూర్చోడానికి, ఎన్నికలకు నిలబడటానికి అనర్హుడు అవుతారు.

దీంతో అప్పటి కాంగ్రెస్ సర్కార్….అప్పీల్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఓటు వేసే సామర్థ్యం లేకుండా దోషులుగా తేలిన చట్టసభల సభ్యులకు సభా కార్యకలాపాల్లో పాల్గొనే పరిమిత హక్కును ఇచ్చేలా రిప్రజంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951కు సవరణ చేస్తూ ఓ బిల్ తీసుకొచ్చింది. అయితే రాజ్యసభలో ఆ బిల్లుకు విపక్షాల సెగ గట్టిగా తగలడంతో ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ బిల్లు తొందరగా పార్లమెంట్ ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ ఓ ఆర్టినెన్స్ తీసుకొచ్చింది. 

అయితే ఈఆర్డినెన్స్ యొక్క కారణాన్ని వివరించడానికి పార్టీ సెప్టెంబర్ 27 న విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఆర్టినెన్స్ పేపర్లను మీడియా ముందే చింపేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ ఆర్టినెన్స్ ఒక పనికిరానిదని,తాను దీనికి వ్యతిరేకమంటూ ఆర్టినెన్స్ పేపర్లు మీడియా సమావేశంలో అందరిముందు చింపేసి సొంతపార్టీ నాయకులకే షాక్ ఇచ్చాడు.

అయితే రాహుల్ బహిరంగంగానే ఆర్డినెన్స్‌ పేపర్లను చించేయడంపై అప్పట్లోనే సంచలనం చెలరేగింది. ఈ సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని భావించారని మాంటెక్‌సింగ్ అహ్లువాలియా తెలిపారు. అప్పట్లో ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, పథకాల రూపకల్పనలో మాంటెక్ సింగ్ కీలక పాత్ర పోషించేవారన్న విషయం తెలిసిందే.  అయితే హుల్ బహిరంగంగానే ఆర్డినెన్స్‌ పేపర్లను చించేయడంపై రచ్చ జరుగుతున్న సమయంలో తాను రాజీనామా చేయాలా? అని మన్మోహన్ తనను అడిగారని అహ్లువాలియా తెలిపారు . ‘బ్యాక్ స్టేజ్: ది స్టోరీ బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్’ పుస్తకంలో ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పొందుపరిచారు.

ఆర్డినెన్స్ ఉదంతంపై మన్మోహన్‌ ను విమర్శిస్తూ అహ్లువాలియా సోదరుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజీవ్ అహ్లువాలియా ఓ ఆర్టికల్ రాశారు. అయితే దీనిని ప్రచురించడానికి ముందే అహ్లువాలియాకు పంపారు. అహ్లువాలియా ఈ వ్యాసాన్ని మన్మోహన్‌కు చూపించారు. అది చదివిన మన్మోహన్…. ‘‘నేను రాజీనామా చేస్తే మంచిదా…’’ అని అహ్లువాలియా అడిగినట్లు ఆయన తన పుస్తకంలో తెలిపారు. అయితే ఈ విషయంలో రాజీనామా చేయడం ఏమాత్రం భావ్యం కాదని తాను మన్మోహన్‌కు సలహా ఇచ్చినట్లు వెల్లడించారు.  అప్పడు తాము అమెరికా పర్యటనలో ఉన్నామని, ఢిల్లీకి చేరుకున్న తర్వాత కూడా ఈ విషయంపై వాడివేడిగానే చర్చ జరిగిందని అహ్లువాలియా ఆ బుక్ లో గుర్తుచేసుకున్నారు.