Manmohan Singh: ఏడున్నరేళ్ల తర్వాత కూడా నెహ్రూని నిందిస్తారా? దేశం పరువు తీస్తున్నారు -మన్మోహన్ సింగ్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Manmohan Singh: ఏడున్నరేళ్ల తర్వాత కూడా నెహ్రూని నిందిస్తారా? దేశం పరువు తీస్తున్నారు -మన్మోహన్ సింగ్

Manmohan Singh Modi

Manmohan Singh: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల చివరి రౌండ్ ప్రచారంలో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌ను గెలిపించాలని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. దేశ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏడున్నరేళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ, ప్రజల సమస్యలపై మాట్లాడేప్పుడు ప్రభుత్వం దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూని నిందిస్తోందన్నారు.

ప్రధానమంత్రి పదవి బాధ్యతతో కూడుకున్నది, దేశాన్ని, చరిత్రను నిందించడం వల్ల ఏమొస్తుందని అన్నారు. నేను ప్రధానిగా ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడలేదు కానీ, పని మాత్రం మాట్లాడిందని మన్మోహన్ సింగ్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ గౌరవాన్ని మసకబారనివ్వలేదు. ప్రపంచంలో భారతీయుల గౌరవాన్ని పెంచేందుకే ప్రయత్నించాను. పేరు చెప్పకుండానే బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), అకాలీదళ్‌లపై మన్మోహన్ సింగ్ మాట్లాడారు. నన్ను బలహీనమైన ప్రధాని అని బీజేపీ, దాని బీ, సి టీమ్ అవమానించాయని అన్నారు.

పంజాబీ ఆత్మగౌరవం అంశాన్ని లేవనెత్తుతూ.. గతంలో ప్రధాని భద్రత పేరుతో ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీతో పాటు పంజాబ్‌ ప్రజల పరువు తీసేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. రైతుల ఉద్యమ సమయంలో కూడా పంజాబ్, పంజాబీల పరువు తీసే ప్రయత్నాలు జరిగాయని అన్నారు. పంజాబీల ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగాలకు ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసిందని కొనియాడారు. పంజాబ్ గడ్డపై పుట్టిన భారతీయుడిగా నేను ఈ విషయంలో చాలా బాధపడ్డానని అన్నారు.

ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థపై అవగాహన లేదని మన్మోహన్ సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందని, నిరుద్యోగం తారాస్థాయికి చేరుకుందన్నారు. దేశంలో సామాజిక అసమానతలు పెరుగుతున్నాయని, అప్పులు పెరిగిపోయి.. ఆదాయం తగ్గుతోందని అన్నారు. ధనికులు మరింత ధనవంతులుగా.. పేద, మధ్యతరగతి వారు మరింత పేదలుగా మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ విధానం, ఉద్దేశం రెండింటిలోనూ లోపాలు ఉన్నాయని, వారి విధానంలో స్వార్థం, ద్వేషం ఉన్నాయని అన్నారు. తమ స్వార్థం కోసం కులం, మతం పేరుతో ప్రజల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ నకిలీ జాతీయవాదం చాలా ప్రమాదకరమైనదని, బ్రిటీష్ వారి విభజించి పాలించే విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం నమ్మకం లేదని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశంలోనే కాదు, విదేశాంగ విధానంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మన్మోహన్ సింగ్ అన్నారు. చైనా సైనికులు ఏడాది కాలంగా మన పుణ్యభూమిలో కూర్చొని ఆటలాడుతుంటే, ఈ విషయాన్ని అటకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. పాత స్నేహితులు విడిపోతున్నారని, ఇతర దేశాలతో సంబంధాలు దిగజారుతున్నాయని అన్నారు. నాయకులను విపరీతంగా కౌగిలించుకోవడం, ఆహ్వానించకుండానే బిర్యానీ తినటం ద్వారా దేశ సంబంధాలు మెరుగుపడవని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అన్నారు.