మోడీకి మన్మోహన్ లేఖ..కరోనా కట్టడికి 5 సూచనలు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు

మోడీకి మన్మోహన్ లేఖ..కరోనా కట్టడికి 5 సూచనలు

Manmohan Singh Modi

MANMOHAN SINGH దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం(ఏప్రిల్-18,2021) లేఖ రాశారు. మన్మోహన్ సింగ్ తన లేఖలో..భారత్‌తో పాటు మిగతా దేశాలన్నీ కరోనా మహమ్మారితో పోరాటం ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ ఏడాది కాలంలో వేర్వేరు సిటీల్లో నివిసిస్తున్న తమ పిల్లలను చూడలేకపోయారు. తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు తమ మనమలు, మనమరాళ్లను చూడలేకపోయారు. ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తమ విద్యార్థులను చూడలేదు. ఎంతోమంది తమ జీవనాధారాన్నే కోల్పోయారు. కోట్లాది మంది పేదరికంలో చిక్కుకున్నారు.

ఇప్పుడు మనమంతా చూస్తున్న కరోనా సెకండ్‌ వేవ్‌తో తమ జీవితాలు మళ్లీ మామూలు స్థితికి ఎప్పుడొస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ మహమ్మారితో పోరాటానికి మనం తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానమైనది వ్యాక్సినేషన్ వేగం పెంచడం. ఈ విషయంలో నా వైపు నుంచి కొన్ని సూచనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో తన సలహాలను స్వీకరిస్తారని ఆశిస్తున్నానని మోడీని ఆ లేఖలో మన్మోహన్ సింగ్ కోరారు.

మన్మోహన్ సూచనలు..
1. వచ్చే ఆరు నెలల కాలానికి సరఫరా చేయడం కోసం వివిధ వ్యాక్సీన్ తయారీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్ల వివరాలు బహిరంగపర్చాలి. వచ్చే ఆరు నెలల కాలానికి వ్యాక్సీనేషన్ కోసం మనం పెట్టుకున్న టార్గెట్లకు అనుగుణంగా ముందస్తుగా ఆర్డర్లు ఇస్తే దాని ప్రకారం తయారీ సంస్థలు సరఫరా చేస్తాయి.
2. వ్యాక్సిన్ దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఎలా పంపిణీ చేస్తారన్నది పారదర్శకంగా ప్రకటించాలి. కేంద్రం వద్ద అత్యవసరం కోసం 10 శాతం వ్యాక్సిన్ ఉంచొచ్చు. అది పోను మిగతాదంతా ఏ రాష్ట్రానికి ఎన్ని వస్తాయి.. ఎప్పుడు వస్తాయన్నది స్పష్టంగా ఉంటే దాన్నిబట్టి రాష్ట్రాలు ప్రణాళిక వేసుకుంటాయి.
3. ఫ్రంట్ లైన్ వర్కర్స్ కేటగిరీలోకి ఎవరెవరు వస్తారన్నది రాష్ట్రాలే నిర్ణయించుకునేలా ఉండాలి. స్కూల్ టీచర్లు, బస్ డ్రైవర్లు, పంచాయతీల సిబ్బంది, లాయర్లు వంటివారిని కొన్ని రాష్ట్రాలు ఫ్రంట్ లైన్ వర్కర్లుగా గుర్తించి 45 ఏళ్ల కంటే తక్కువ వయసున్నా వ్యాక్సిన్ వేయాలనుకోవచ్చు. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉండాలి.
4. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచంలోనే వ్యాక్సిన్ల తయారీలో ముందుంది. ఈ ఉత్పత్తి సామర్థ్యంలో అత్యధికం ప్రైవేటు చేతుల్లోనే ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం సహకారం అందించాలి. నిధులు సమకూర్చడం, రాయితీలు ఇవ్వడం ద్వారా ఉత్పత్తి మరింత పెంచేలా చేయగలగాలి.
5. దేశీయ ఉత్పత్తి మన అవసరాలకు చాలకపోవడం వల్ల యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ, యూఎస్ఎఫ్‌డీఏ వంటి నమ్మకమైన సంస్థల అనుమతులు పొందిన విదేశీ వ్యాక్సిన్లనూ ఈ అత్యవసర పరిస్థితుల్లో మనం అనుమతించొచ్చు. మన దేశంలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం పట్టుపట్టరాదు. కాదంటే పరిమిత కాలానికే ఈ వెసులుబాటు ఇస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. ప్రస్తుతానికి మన దేశంలో కొద్దిమంది జనాభాకే వ్యాక్సీన్ వేసినప్పటికీ తగిన విధాన నిర్ణయాలతో త్వరలోనే మరింతమందికి వేయగలమనుకుంటున్నాను. నా సూచనలను ప్రభుత్వం స్వీకరిస్తుందని, ఆ మేరకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను అని ఆ లేఖలో మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు.