గుగూల్ మాప్స్ కు ప్రత్యామ్నాయం..ఇస్రో-మ్యాప్ మై ఇండియా మధ్య ఒప్పందం

గుగూల్ మాప్స్ కు ప్రత్యామ్నాయం..ఇస్రో-మ్యాప్ మై ఇండియా మధ్య ఒప్పందం

MapmyIndia దైనందిన కార్యక్రమాల్లో గూగుల్‌ మ్యాప్స్‌ ఒక భాగమైపోయింది. అయితే ప్రకటనల ఆదాయం కోసం గూగుల్‌ మన సమాచారాన్ని కంపెనీలకు ఇస్తోండటం…వ్యక్తిగత సమాచార భద్రతకు చాలా ముప్పు ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్‌ మ్యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతో దేశ ప్రజలకు నావిగేషన్‌,మ్యాప్స్‌ సేవలను అందించేందకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)-మ్యాప్‌ మై ఇండియా జతకట్టాయి. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ (DOS), మ్యాప్‌ మై ఇండియా మాతృసంస్థ సీఈ ఇన్ఫో సిస్టమ్స్‌ తో గురువారం ఒప్పందం కుదిరినట్టు ఇస్రో ప్రకటించింది.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఒప్పందం జరిగినట్టు మ్యాప్‌ మై ఇండియా సీఈవో రోహణ్‌ వర్మ తెలిపారు. స్వదేశీ నావిగేషన్‌ సేవల్లో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా అభివర్ణించారు. మ్యాప్‌ మై ఇండియా సంస్థ బాధ్యతాయుతమైన, స్థానిక కంపెనీ. దేశసార్వభౌమత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాపులను రూపొందించగలదు. భారత ప్రభుత్వం ప్రకారం సరిహద్దులను సూచించగలదని తెలిపారు.

గూగుల్ మాప్స్ ని అందరూ ఉచితం అనుకొంటారని.. కానీ మనకు తెలియకుండా అందులో చాలా లొసుగులు ఉన్నాయని… మ్యాప్స్‌ వాడుతున్న సమయంలో ప్రకటనల ద్వారా సంస్థకు ఆదాయం వస్తుందన్నారు రోహణ్‌ వర్మ. కంపెనీలు ప్రకటనలు ఇవ్వడానికి మన లొకేషన్‌ను తీసుకొంటాయని తెలిపారు. ఇది సమాచార భద్రతపరంగా ప్రమాదకరమైన అంశమని రోహణ్‌ వర్మ చెప్పారు. మ్యాప్‌మై ఇండియాలో ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవన్నారు.

ఈ ఒప్పందం ప్రకారం… మ్యాప్‌ మై ఇండియాలో ఉన్న డిజిటల్‌ మ్యాప్ లను, ఇస్రో ఉపగ్రహ చిత్రాలతో సమన్వయం చేసి మ్యాపులను, నావిగేషన్‌ సేవలను ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కలయికతో మ్యాప్‌ మై ఇండియా యూజర్లు ఇస్రో ఉపగ్రహాల సమాచారంతో మరింత స్పష్టంగా మ్యాప్ లను పొందవచ్చు. నావిగేషన్‌ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ద్వారా నావిగేషన్‌ సేవలు లభిస్తాయి.